ఖాళీ బిందెలతో ధర్నా
ప్రజాశక్తి - చింతలపూడి
తాగునీరు అందించాలని, రోడ్డు నిర్మించాలని, వీధిలైట్లు వేయించాలని స్థానిక ఎస్‌టి హాస్టల్ వెనుక నివసిస్తున్న ప్రజలు ధర్నా చేశారు. ఖాళీ బిందెలతో ఎపి ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి కోసం ఎండలో ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కుళాయి పంపులైనా బిగించాలని కోరారు. వీధిలైట్ల సౌకర్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అధికారులు స్పందించాలని కోరారు. చింతలపూడి నగర పంచాయతీలోని బోయగూడెం పరిధిలో ఎస్‌టి హాస్టల్ వెనుక సుమారు 20 కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. తాగునీటి సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో తాగునీటి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. తమ వీధిలో వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునామని, విషసర్పలు సంచరిండంతో భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. తాము ఇంటి పన్నులు కడుతున్నామని, కుళాయి, వీధిలైట్లు వేయించాలని కోరారు. రోడ్లు కూడా వేయించాలని కోరారు. దీనిపై తహశీల్దార్ కృష్ణజ్యోతి మాట్లాడుతూ ప్రస్తుతం తాగునీటి ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తామని, త్వరలో పైపులైన్లు వేయిస్తామని తెలిపారు. అనంతరం స్పందన అధికారికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మార్తిన లక్ష్మి, కోట లక్ష్మి, ఐద్వా జిల్లా నాయకులు ఎం.వరలక్ష్మి దేవి, పట్టణ నాయకులు, కె.అనురాధ పాల్గొన్నారు.










