ప్రజాశక్తి-ఆదోనిరూరల్
మండలంలోని గణేకల్లు గ్రామంలో ప్రజలకు నీరందించడం పాలకులు నిర్లక్ష్యం వీడాలని సిపిఎం మండల కార్యదర్శి వర్గసభ్యులు వీరారెడ్డి, రామాంజనేయులు, శాఖ కార్యదర్శి విరుపాక్షి తెలిపారు. శనివారం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుప్పగల్ ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి ఆరు గ్రామాలకు తాగునీటినీ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పాలకులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో ప్రతి నెలలో ఒకసారి తాగునీటి సమస్య నెలకొంటోందని చెప్పారు. మరి ఉన్న ఒక్క మోటార్ మరమ్మతులకు వస్తే చేయించే వరకు తాగు నీటి సమస్య పరిష్కారం కావడానికి పది నుంచి 15 రోజులు పడుతోందని తెలిపారు. అదనపు మోటార్ ఏర్పాటు చేయాలని సిపిఎంగా ఎన్నిసార్లు విన్నవించినా పాలకులు, గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు మొదలయ్యాయని, పనులు వదులుకొని సుమారు 2, 3 కిలోమీటర్లు వెళ్లి వర్షపు నీరు తెచ్చుకొని తాగి అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా మేల్కొని తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ప్రజలను సమీకరించి ప్రధాన రోడ్డుపై బైఠాయిస్తామని హెచ్చరించారు. నాయకులు చిరంజీవి, రామకృష్ణ, బంగారయ్య, హుస్సేని పాల్గొన్నారు.
సచివాలయ సిబ్బందికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు










