ప్రజాశక్తి-అమలాపురం
అమలాపురం పట్టణం మున్సిపల్ వర్కర్స్ కాలనీలో సుమారు 15 రోజుల నుంచి తాగునీరు కుళాయిల్లో నీరు రాకపోవడంతో స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ వర్కర్స్ అయిన వారు తమ విధుల నిర్వహణలో భాగంగా ఉదయం 5 గంటలకి ఇంటి నుంచి వెళ్లి తిరిగి 10 గంటలకు ఇంటికి వచ్చేసరికి ఇంటి వద్ద నీళ్లు లేకపోవడంతో వంట వండుకోవడానికి తాగటానికి ఇంటి అవసరాల కొరకు నీరులేక తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు విన్నవించుకున్న పట్టించుకునే నాధుడు లేడని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం స్థానిక మహిళలు మున్సిపల్ కాలనీలో ఖాళీ బిందెలతో తమ నిరసన తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని మున్సిపల్ వర్కర్స్ కాలనీకి మంచినీటి ఇబ్బందిని పరిష్కరించవలసిందిగా వారు కోరుతున్నారు.










