Dec 02,2022 23:08

ప్రజాశక్తి-ఏ కొండూరు

 ఏ కొండూరు మండలానికి కృష్ణా జలాలను పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేసి ప్రతి ఇంటికి కృష్ణా జలాలను తాగునీరుగా అందించనున్నట్లు తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి అన్నారు. శుక్రవారం మండలంలోని కుమ్మరి కుంట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఏకొండూరు మండల ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని, ఆ సమస్యకు నేటితో శాశ్వత పరిష్కారం లభించిందని ఆయన అన్నారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఏ కొండూరు మండలానికి 38 కోట్లు మంజూరైనట్లు ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చారని అన్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్య గత ప్రభుత్వ హయాంలోనే తీవ్రంగా ఉండేదని, అప్పటిలో ఆ ప్రభుత్వం కిడ్నీ బాధితుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి పదివేల రూపాయలు పెన్షన్‌ అందజేస్తున్నామని, అత్యవసరంగా కష్ణా జలాలను అందించే ఉద్దేశంతో గిరిజన తండాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నామని ఆయన తెలిపారు. కిడ్నీ రోగులకు కావలసిన మందులు కూడా ఏ కొండూరు పీహెచ్సీలో ఉన్నాయని, ఇకనుండి ఆ మందులు గ్రామాలలోని సచివాలయాల ద్వారా ఏఎన్‌ఎం వాలంటీర్ల ద్వారా రోగులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూసీ ఈఈ డిఆర్‌ఎల్‌ ప్రసాద్‌, డిఈ వి సత్యనారాయణ, ఏఈ సిహెచ్‌ లక్ష్మీ, గ్రామ సర్పంచ్‌ లా వూరి గీతామహాలక్ష్మి, ఏఎంసీ చైర్మన్‌ నాగి నర్సిరెడ,ి్డ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి, జెడ్పిటిసి భూక్య గనియ, గొల్లమందల పిఎసిఎస్‌ చైర్మన్‌ పాలెం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.