Mar 21,2023 18:56

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

తాగునీటి సమస్య పరిష్కారానికి
ముందస్తు చర్యలు చేపట్టాలి : సిపిఎం

ప్రజాశక్తి - ఆత్మకూరు

పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ముందస్తు చర్యలు చేపట్టాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్‌, పట్టణ నాయకులు ఎన్‌ స్వాములు,ఏ సురేంద్ర, డి రామ్‌ నాయక్‌లు పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 24 వార్డులలో 365 రోజులు నిరంతరాయంగా ప్రజలకు నీటి సరఫరా చేస్తామని చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యలు చేపకట్టకపోవడం వారి నిర్లక్ష్యానికి తాగునీటి సమస్య నిదర్శనమన్నారు. వేసవికాలం సమీపిస్తుండడంతో ఆత్మకూరు పట్టణం చుట్టూ నీరు ఉన్న పట్టణంలోని అన్ని కాలనీలకు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులకు ఒకసారి నీరు వదలడం తో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చేతి పంపులు మరమ్మతులకు నోచుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి మున్సిపల్‌ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు.