Apr 05,2023 22:35

ప్రజాశక్తి - భీమడోలు
            మండలంలోని పొలసానిపల్లి గ్రామంలో తాగునీటి సరఫరా సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు గ్రామ సర్పంచి షేక్‌ రహీమా బేగం హసేన తెలిపారు. ఈ మేరకు అవసరమైన నిధుల మంజూరుకు సహకరించిన ఎంఎల్‌ఎ వాసుబాబుకు, గ్రామ పంచాయతీ పాలకమండలికి సర్పంచి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ భీమడోలు-ద్వారకాతిరుమల ఆర్‌అండ్‌బి రోడ్డు గ్రామం మధ్యగా వెళ్తుందన్నారు. దశాబ్ద కాలానికి పూర్వం నుంచే రోడ్డుకు రెండు వైపులా గ్రామం విస్తరించి ఉందన్నారు. గ్రామానికి రెండు వైపులా తాగునీరు అందించినందుకు పైపులైన్‌ రోడ్డు కిందుగా ఏర్పాటు చేశారన్నారు. ఆ తర్వాత క్రమంలో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రూ.50 కోట్ల వ్యయంతో ఆర్‌అండ్‌బి శాఖ రోడ్డును విస్తరించడంతో పాటు రోడ్డును అభివృద్ధి చేశారన్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి పైపులైను రోడ్డు మధ్యగా వచ్చిందన్నారు. దీంతో పైపులైన్‌ మరమ్మతుకు కాని, పైపులైన్‌ ద్వారా నూతన కనెక్షన్లను ఇచ్చేందుకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను సర్పంచి ఎన్నికల సందర్భంగా గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీటిని అందించేందుకు నూతన పైపులైన్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చానన్నారు. ఈ క్రమంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చిన ఎంఎల్‌ఎ దృష్టికి సమస్యను తీసుకువెళ్లామని తెలిపారు. దీనిపై స్పందించిన ఎంఎల్‌ఎ నూతన పైపులైన్‌ ఏర్పాటుకు రూ.20 లక్షల జల జీవన్‌ మిషన్‌ నిధులను కేటాయించారన్నారు. వీటితో యుద్ధ ప్రాతిపదికన రహదారికి రెండు వైపులా నీటి సరఫరాకు అంతరాయం లేని విధంగా నూతన పైపులైను ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం కొద్ది మేరకు అవసరమైన నిధులను గ్రామపంచాయతీ నుంచి సమకూర్చామన్నారు. ప్రధాన మురుగునీటి కాలువల పూడికతీత, ప్రక్షాళన కార్యక్రమాలను చేపట్టామని సర్పంచి వివరించారు.