May 23,2023 19:50

బోరు వద్ద నీటిని తెచ్చుకుంటున్న ప్రజలు

ప్రజాశక్తి - చిప్పగిరి
వేసవి ప్రారంభం నుంచి చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య జటిలంగా మారింది. డేగలహాల్‌ గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని సర్పంచి నీలకంఠ అధికారులను నిలదీస్తున్నారు. చింతకుంట జలాశయం నుంచి డేగలహాలు, ఏరూరు, చిప్పగిరి, దౌల్తాపురం గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. జలాశయం నుంచి తాగునీరు వదిలే కాంట్రాక్టర్లు ఒక పద్ధతిలో పని చేయకుండా లేని పోనీ సమస్యలు చెబుతూ విద్యుత్‌ సరిగా లేదని కుంటి సాకులు చెబుతున్నారని సర్పంచులతోపాటు మండల ప్రజలు పేర్కొంటున్నారు. గ్రామాల్లో కనీసం తాగునీరు కూడా అందించడం లేదని సర్పంచులపై ప్రజలు మండిపడుతున్నారు. దౌల్తాపురం, బెల్డోనా గ్రామాల్లో ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు, ఎద్దుల బండ్లపై నీటిని తెచ్చుకునే పరిస్థితి దాపురించిందని ఆ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నా కిందిస్థాయి సిబ్బంది అనుకున్న స్థాయిలో పనులు చేయకపోవడం వల్లనే తాగునీటి సమస్య తారాస్థాయికి చేరిందని ప్రజలు వాపోతున్నారు.
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
- డేగలహాల్‌ సర్పంచి నీలకంఠ

తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పరిష్కారం చూపాలి. చింతకుంట జలాశయం నుంచి పంపింగ్‌ చేసే కాంట్రాక్టర్‌ నగరడోనా నాగేంద్ర చిప్పగిరి మండలంలో ఏయే గ్రామాల్లో ఎక్కువగా తాగునీటి సమస్య ఉందో తెలుసుకొని కనీసం 10 రోజులకోసారి తాగునీరు విడిచేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.