Aug 31,2023 22:37

సమావేశంలో మాట్లాడుతున్నసిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి. నాగేశ్వరరావు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : శ్రీ సత్య సాయి నీటి సరఫరా కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం రోడ్డున పడేసిందని, కార్మికుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని నీటి సరఫరా పంపు హౌస్‌ వద్ద కార్మికుల సమ్మె బుధవారం ఏడవ రోజు కొనసాగింది. వీరి ఆందోళనకు మద్దతుగా నాగేశ్వరరావు తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్‌ వెంకటేష్‌, మున్సిపల్‌ కార్మికుల జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఐదు నెలల వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ ఇవ్వకుంటే కార్మికులు తమ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విధి లేని పరిస్థితులలో కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఆ పథకంలో పనిచేస్తూ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు గ్రాడ్యుటీ ఇవ్వాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ఇతర పథకాలకు కోట్లాది రూపాయలు బటన్‌ నొక్కి ఇస్తున్నారని, కాలే కడుపుల కార్మికులకు ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. 572 మంది కార్మికులు దాదాపు వెయ్యి గ్రామాలకు తాగునీరు అందిస్తూ పని చేస్తుంటే ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం దారుణానికి పాల్పడుతోందని విమర్శించారు. కార్మికులు న్యాయం చేయలేని పాలకులు, అధికారులు ఆందోళన చేస్తున్న కార్మికులను, నాయకులను పోలీసులు చేత అరెస్టు చేయిస్తున్నారన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ఇఎస్‌ వెంకటేష్‌, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని విమర్శించారు. ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పోరాటాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మధుసూదన్‌, నరేష్‌, ఓబులేష్‌, ఈశ్వరయ్య, బాబు, శంకర్‌, ప్రభు, నాగేంద్ర రెడ్డి, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.