ప్రజాశక్తి-పాడేరు:జల్ జీవన్ మిషన్లో చేపట్టిన తాగునీటి పథకాలను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో గ్రామీణ నీటి నరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులతో తాగునీటి పథకాల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాగునీటి పథకాల నిర్మాణాల్లో పటిష్టమైన నాణ్యతలు పాటించాలని స్పష్టం చేసారు. పైపులు వేస్తే పని అయినట్టు కాదని, బోరువెల్, మంచి నీటి ట్యాంకు నిర్మించి తాగునీటి సరఫరా చేయాలన్నారు. మంచి నీటి ట్యాంకుల నిర్మాణాలు పనులు వేగంగా ప్రారంభించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. పూర్తి చేసిన పనులకు సకాలంలో బిల్లు చెల్లించడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి పథకాల నిర్మాణాలను ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం గ్రామీణ నీటి సరఫరా విభాగం డైరీ 2023ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇఇ పి.లీలాక్రిష్ణ, డిఇఇలు జివిఎస్. ప్రకాష్, ఎం.జయరామ్, జి.గోపాలక్రిష్ణ, జి.రుక్మాంధరరాజు, చంద్ర కిరణ్, 11 మండలాల ఎఇలు పాల్గొన్నారు.










