ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి తరచూ కాలుషం, కుళాయిల ద్వారా పూర్తిస్థాయిలో తాగునీరు సక్రమంగా రాకపోవడంతో యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో గ్రామ సర్పంచ్ బయట నుంచి సురక్షితమైన తాగునీటిని తెప్పించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా తరచూ ఈ సమస్య వస్తున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మండలం కొండెవరం, వాకతిప్ప, మూలపేట, ఉప్పాడ తదితర గ్రామాల్లో కలుషిత నీటి వల్ల గ్రామీణ ప్రజలు అనారోగ్యాలకు గురువుతున్నారు. ఈ పరిస్థితి ఆ ఒక్క మండలంలోనే కాదు. పలు గ్రామాల్లో కలుషిత నీటినే తాగాల్సి వస్తోంది. ప్రభుత్వం చేతిపంపులు, రక్షిత, మినీ రక్షిత మంచినీటి పథకాలను అమలు చేస్తున్నా అక్కరకు రాకుండా పోతోంది. జల్ జీవన్ మిషన్ వంటి కీలకమైన ప్రాజెక్టులను ప్రారంభించినా నిధుల కొరతతో పధకం పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పలు చోట్ల పథకాల ద్వారా అందించే నీరు సురక్షితంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో తాగునీటి నాణ్యత పరీక్షలను గ్రామపంచాయతీ స్థాయిలోనే నిర్వహించేలా రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ టెస్ట్ కిట్లు (ఎఫ్ టీకే) అందించారు.వీటి ద్వారా పంచాయతీ స్థాయిలోనే నీటి నాణ్యతను పరీక్షించి, లోపాలను అక్కడికక్కడే పరిష్కరించాలని వీటిని సమకూర్చారు.
అరకొరగానే పరీక్షలు
కాకినాడ జిల్లాలో 385 గ్రామ పంచాయితీల్లో 667 ఆవాసాల్లో 21 సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పధకాల ద్వారా 374 ఆవా సాలకు రక్షిత మంచి నీటి సరఫరా జరు గుతోంది. వీటితో పాటు 710 రక్షిత మంచినీటి సరఫరా పధకాలు, 3415 చేతి పంపుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన అన్ని అవాసములకు తాగునీటి సరఫరా జరుగుతోంది. అన్ని పంచాయతీలకు రెండు సంవత్సరాలు క్రితం రూ.800 విలువైన ఎఫ్‌టీకే కిట్లు ఇచ్చారు. వీటిలో కొన్ని రకాల లిక్విడ్‌లు, మందులు, పరీక్షా పరికరాలు ఉన్నాయి. వీటి వినియోగంపై సచి వాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. వీటి ద్వారా క్లోరైడ్,ఫ్లోరైడ్, ఐరన్, లవణాల లభ్యత, ఉదజని సూచిక, క్షార గుణ సాంద్రత, సంపూర్ణ కఠినత్వం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. అయితే జిల్లాలో పలుచోట్ల ఈ కిట్లు ద్వారా పరీక్షలు చేయడం లేదు. కొన్నిచోట్ల మొక్కుబడిగా పరీక్షలు చేసి మమ అనిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిని పంచాయతీలు, సచివాలయాల్లో మూలన పడేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రసాయనాలు, మందులు కాలపరిమితి ముగిసినట్లు సిబ్బంది తెలిపారు.
పట్టని అధికారులు
నాణ్యతను పరీక్షించి ప్రజలకు మంచి నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీరాజ్,ఆర్ డబ్ల్యూఎస్, జిల్లా పంచాయతీశాఖల మధ్య సమన్వయలోపంతో పరీక్షలు అరకొరగానే జరుగుతున్నాయి. దీంతో ప్రజలు కలుషిత నీటితో రోగాల బారిన పడుతున్నారు. అలాగే పలుచోట్ల ఫిల్టర్ బెడ్లు దెబ్బతిన్నాయి. దీంతో నీటిని నేరుగానే పంపింగ్ చేస్తున్నారు. అనేక పంచాయతీల్లో వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ కూడా సక్రమంగా చేయడం లేదు. పలు గ్రామాల్లో పైప్ లైన్లు మరమ్మతులకు గురయ్యాయి. బోర్ల చుట్టూ నీరు నిలిచిపోవడంతో ప్రజలకు సరఫరా అయ్యే నీరు చాలా వరకూ కలుషితమవుతుంది.










