ప్రజాశక్తి-చింతూరు
చింతూరు మండల కేంద్రంలో తాగునీటి పైపులైన్ల ఏర్పాటుకు కాంట్రాక్టరు ఇష్టానుసారంగా ప్రొక్లెయిన్‌తో తవ్వకాలు చేస్తున్నారు. దీంతో గ్రామంలోని రోడ్లు శిథిలమవుతున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్ కేబుల్ వైర్లు తెగి ముక్కలవుతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యాన జల్ జీవన్ మిషన్ పథకం నిధులు రూ.31 లక్షలతో చింతూరులో ఇంటింటికి తాగునీటి కుళాయిల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పైపులైన్ల ఏర్పాటుకు సదరు కాంట్రాక్టరు గ్రామంలోని సిసి రోడ్లు, అంతర్గత తారురోడ్లను ప్రొక్లెయిన్‌తో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లు పగిలిపోయి శిథిలమవుతున్నాయి. గతంలో ఉన్న పాత పైపులైను కూడా ధ్వంసం చేస్తున్నారు. పైగా కొద్ది మందికి మాత్రమే కుళాయి కనెక్షన్లు వేస్తున్నారు.
పైపులైన్ల ఏర్పాటు చేస్తున్న తవ్వకాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ వారు భూగర్భలో వేసిన కేబుల్స్ కట్ అవుతున్నాయి. అండర్ గ్రౌండ్‌లో పైపులైన్లు వేసేటప్పుడు అప్పటికే భూగర్భంలో ఏమైనా పైపులైన్లు, కేబుల్స్ ఉంటే ఆ సంస్థల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. తమ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు చెబుతున్నారు. లక్ష రూపాయల విలువైన బిఎస్‌ఎన్‌ఎల్ కేబుల్స్ కట్ అవుతున్నా సదరు కాంట్రాక్టరు పట్టించుకోకుండా తవ్వకాలు సాగిస్తున్నారు.
సీసీ రోడ్లు, తారు రోడ్లు ధ్వంసం, బిఎస్‌ఎన్‌ఎల్ కేబుల్స్ కట్ అవుతున్న విషయమై ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ బుజ్జిబాబును వివరణ కోరగా పైపులైన్ వేసే క్రమంలో రోడ్లు పగిలిపోవడం సహజమేనని సమాధానం ఇచ్చారు. ఇప్పటికే రహదారి సౌకర్యాలు సరిగా లేక ప్రజలు దశాబ్ద కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉన్న కాస్తంత రోడ్లను ఇష్టానుసారంగా తవ్వేసి ధ్వంసం చేయడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై స్పందించి పైపులైన్ తవ్వకంలో పగిలిపోయిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విలువైన బిఎస్‌ఎన్‌ఎల్ కేబుల్ పాడైనందున తగిన పరిహారం వసూలు చేయాల్సి ఉంది.










