ప్రజాశక్తి -విఆర్ పురం: మండలంలోని రేఖపల్లి పంచాయతీ కేంద్రంలో పెట్ట బుచ్చయ్యవీధిలో తాగునీటి పైపులైన్ పనులకు స్థానిక సర్పంచ్ పూనెం సరోజిని ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇంటింటికీ పైపులైన్ ద్వారా కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. ముందుగా పంచాయతీ కేంద్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించి, తర్వాత పరచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ రానున్న వేసవిలోగా దాహార్తి తీర్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. దీంతోపాటు పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో వీధిదీపాలు, డ్రైనేజీలు, తాగునీరు,ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పంచాయతీకి అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో పెట్టుకుని, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి తాము ముందుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, నాళ్లరపు ప్రకాశరావు, సచివాలయం కార్యదర్శి శివప్రసాద్ పాల్గొన్నారు.










