ప్రజాశక్తి -గాజువాక : అగనంపూడి ఎస్‌సి కాలనీ, బొర్రమాంబ ఉప్పర కాలనీలో రూ.19.90లక్షలతో ఏర్పాటు చేయనున్న తాగునీటి పైపు లైన్‌కు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలన కొనసాగుతోందని స్పష్టంచేశారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాల్లో 95 శాతం అమలు చేశారని, చెప్పనివి కూడా చేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో గడప వద్దకే పాలన తెచ్చారన్నారు. 85వ వార్డులో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి వార్డు కార్పొరేటర్ ఇళ్లపు వరలకీëప్రసాద్ తీసుకెళ్లారు. వాటర్ స్కీం పథకం వల్ల కొండవాలు ప్రాంతంలోని కాలనీలకు తాగునీటి సదుపాయం మెరుగవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఇల్లపు ప్రసాద్, యలమంచిలి అప్పారావు, నక్క రమణబాబు, ఇళ్లపు వాసు తదితరులు పాల్గొన్నారు.










