ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : గుంటూరు ఛానల్లో పేరుకుపోయిన తూటికాడను వెంటనే తొలగించి సమస్యని పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్ చేశారు. సమస్యల అధ్యయనంలో భాగంగా మండలంలోని కాజలో సిపిఎం బృందం మంగళవారం పర్యటించి పరిశీలించడంలోపాటు స్థానికులతో మాట్లాడారు. పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాయకుల దృష్టికి తెచ్చారు. గుంటూరు ఛానల్ తూటికాడ విపరితంగా పెరిగి నీటిపారుదల తగ్గిందని, నీరు ముగురుగా మారడం, వాటిని ట్యాంకులకు తరలించి కుళాయిలకు సరఫరా చేయడంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారని చెప్పారు. దురదలు, దద్దుర్లతో ఇబ్బందులు పడుతున్నామని మరికొందరన్నారు. ఇళ్లపట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, రైతు భరోసా కేంద్రం నిరుపయోగంగా ఉందని చెప్పారు. పంటకు మద్దతు ధర దక్కడం లేదన్నారు. డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని, అధికారులకు విన్నవిద్దామని వెళితే తమ పరిధిలోది కాదంటూ, కార్పొరేషన్‌లో విలీనమైందంటూ చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అరకొరగానే సరఫరా చేస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి తూటికాడను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇతర సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో సిపిఎం చేపట్టే పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, నాయకులు బి.కోటేశ్వరి, టి.ప్రసాదరెడ్డి, ఎ.సాంబిరెడ్డి, మాజీ ఎంపిటిసి ఇ.ప్రతాపరెడ్డి, ఎస్.సుమ, శివయ్య, నరసింహారావు, ఆది శేఖర్, సత్యమారెడ్డి, ఎస్.లక్ష్మారెడ్డి, రమేష్ పాల్గొన్నారు.










