ప్రజాశక్తి-కాకినాడ రూరల్ తూరంగి పంచాయతీ అల్లూరి సీతారామరాజు కాలనీలో నెల రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు శనివారం సచివాలయం వద్ద మహిళలు ధర్నా నిర్వహించారు. నీటి సమస్యను సచివాలయ కార్యదర్శి రేవతి దృష్టికి తీసుకువెళ్లారు.ఆమె వెంటనే స్పందించి ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కక్కల లక్ష్మి మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమకు మంచినీరు రావడం లేదని వాపోయారు. పంచాయతీ కుళాయిల్లో వచ్చిన నీరు ఆకుపచ్చగా మురికి వాసనతో ఉందన్నారు. మే నెలలో ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేసేవారని జూన్ నెల వచ్చినా నేటికీ తాగునీరందించ లేదన్నారు. మహిళలు ఆందోళన చేసిన తరువాత ఒక ట్యాంక్ నీటిని మాత్రమే పంపిం చారని ఆమె తెలిపారు. సిపిఎం నాయకులు చింతపల్లి అజరు కుమార్ మాట్లాడుతూ బుల్లెబ్బాయి నగర్‌లో ఉన్న మంచి నీటి చెరువుపై తగిన పర్యవేక్షణ లేక, ప్లాంట్ అభివద్ధి పనులు చేపట్టక పోవడమే దీనికి కారణమన్నారు. అనంతరం బుల్లె బ్బాయి నగర్ ఉన్న ప్లాంట్‌ను నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జోగా అప్పారావు, వాసంశెట్టి మంగ, కణితి సుభలక్ష్మి, పొట్నూరి సత్యవతి, వేపాడ నాగమణి, షేక్ ఖాదర్, భవానీ, దుర్గ పాల్గొన్నారు.










