ప్రజాశక్తి - వేలేరుపాడు
తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని రెడ్డిగూడెం గ్రామస్తులు గురువారం ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. మేడేపల్లి పంచాయతీ రెడ్డిగూడెంలో నెల రోజులుగా తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఖాళీబిందెలను ప్రధాన రహదారిపై పెట్టి జోరువానను సైతం లెక్కచేయకుండా ఎనిమిది గంటలు పాటు రాస్తారోకో చేశారు. ఈ ధర్నాకు సిపిఎం, సిపిఐ మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య మండల కార్యదర్శి కరాటం సీతామహాలక్ష్మీ మాట్లాడుతూ నెల రోజులుగా తాగునీరు లేక అల్లాడుతూ తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. మండలంలో అనేక గ్రామాల్లో నీటి సమస్య ఉందన్నారు. అధికారులు స్థానికంగా ఉండకుండా దూర ప్రాంతాల నుండి రాకపోకలు సాగిస్తుంటే స్థానిక సమస్యలు ఎలా తెలుస్తాయని విమర్శించారు. సమస్య పరిష్కారమయ్యే వరకూ కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మేడేపల్లి సర్పంచి కట్టం రాంబాబు, సచివాలయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని 24 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎపిజిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య, సిపిఎం మండల కార్యదర్శి ధర్ముల రమేష్, సిపిఐ మండల కార్యదర్శి బి.రాము, గ్రామస్తులు ఊకే వెంకమ్మ, కారం. కుమారి, రాణి, కరుణ, ముత్తమ్మ, దుర్గమ్మ, మంగమ్మ, లక్ష్మి, రమేష్, కామయ్య పాల్గొన్నారు.










