Oct 11,2023 20:43

ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు
ప్రజాశక్తి - మొగల్తూరు
నియోజకవర్గంలో ప్రతి మారుమూల ప్రాంతం లోనూ తాగునీటి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. బుధవారం శేరేపాలెం పంచాయతీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించి అనంతరం ఉన్నత పాఠశాలలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తాగునీటి ఇబ్బందిగా ఉండే శేరేపాలెంలో ఒహెచ్‌ఆర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి మొగల్తూరు సిబిడబ్ల్యూ ప్రాజెక్టు నుంచి ప్రత్యేక వైడ్లైన్‌ నిర్మాణాలకు జలజీవన్‌ మిషన్‌ నుండి రెండో విడతలో రూ.6 లక్షలు కేటాయించామన్నారు. గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, రూ.22 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అదే గ్రామంలో ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామంలోని 1100 కుటుంబాల్లో 600 మందికి ఈ శిబిరంలో వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి తణుకులు మునేశ్వరరావు, జెడ్‌పిటిసి తిరుమాని బాపూజీ, వైస్‌ ఎంపిపి కైలా సుబ్బారావు, కాగిత సత్యవాణి పాల్గొన్నారు.