Apr 16,2023 23:14

గెడ్డలో నీటిని సేకరిస్తున్న గిరిజన మహిళలు

ప్రజాశక్తి-పెదబయలురూరల్‌:మండలంలోని గంపరాయి పంచాయతీ చీడిపుట్టు గ్రామంలో తాగునీటి ఎద్దడితో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామంలో సుమారు 60 కుటుంబాలు ఉండగా 400 మంది జనభా ఉన్నారు. ఈ గ్రామాన్ని దీర్ఘకాలికంగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. తాగునీటి సమస్య పరిష్కరించాలని గతంలో జన్మభూమి, రచ్చబండ, గ్రామసభల వంటి పలు ప్రభుత్వ కార్యక్రమాలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నా ఏ ఒక్క అధికారి స్పందించ లేదు. ఈ గ్రామంలో1995 సంవత్సరంలో చిన్న రింగ్‌ బావిని ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు వాడుకలో ఉంది. నీరు అడుగంటి పోవడంతో ప్రస్తుతం శిధిలావస్థకు చేరుకుంది. మత్స్య గెడ్డలో కలుషితమైన నీరు తాగి గొంతు తడుపుకుంటున్నామని గిరిజనులు తెలిపారు. ఎండాకాలం కావడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. ఒక్కొక్కసారి బురద నీరు తాగి డయోరియా వంటి వ్యాధుల బారిన పడి చిన్నారులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు వాపోయారు. వర్షాకాలంలో మంచినీటి కోసం గెడ్డకు వెళ్లి కాలుజారి గల్లంతైన సంఘటనలు కూడా ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఎన్నికల సమ యంలో వివిధ పార్టీల నాయ కుల ఓట్ల కోసం వచ్చిన సందర్భంలో తాగు నీటి సమస్య పరిష్కరించాలని కోరినప్పుడు ప్రజా ప్రతినిధులు సానుకూ లంగా స్పందిస్తూ హామీ లిస్తూ గాలికొదిలేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి చీడిపుట్టు గ్రామానికి జల జీవన్‌ మిషన్‌ స్కీం కింద తాగునీరు అందించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకుంటే ఖాళీ బిందెలతో చలో కలెక్టరేట్‌ కార్యక్రమం తలపెడతామని చీడిపుట్టుకు చెందిన వంతల తీరుపతి, వంతల మోహన్‌రావు, వంతల చింగుడు, కిలో నీలకంఠం, కిల్లో శ్రావణి, దేవి, గౌతమి తదితరులు తెలిపారు.
మండల పరిషత్‌ ఎంపీపీ నిధుల నుండి లక్ష 50 వేల వ్యయంతో మోటార్‌ బోర్‌ ద్వారా వారం రోజుల్లో తాగునీరు అందిస్తామని ఆర్‌డబ్లుఎస్‌ జెఈ కురేష్‌ తెలిపారు.