Feb 15,2023 23:55

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి -పాడేరు:గిరిజన గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని తాగునీటి సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్‌ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, 11 మండలాల ఎంపిడిఓలతో కలెక్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జల జీవన్‌ మిషన్‌ పథకంలో మంజూరు చేసిన పనులను నిర్దిష్టమైన కాల పరిమితిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి పథకాల పూర్తి డేటా ఎంపిడిఓల దగ్గర ఉండాలన్నారు. ఎంపిడిఓలు, జెజెఎం పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యుత్‌ అధికారులతో సమన్వయం చేసుకుని విద్యుత్తు మోటారు సమస్యలు పరిష్కరించాలన్నారు. పక్కా భవనాలకు ముందుగా పంచాయతీ అనుమతులు తీసుకుని నిర్మాణం, అనంతరం విధిగా ఆస్తుపన్నులు చెల్లించాలన్నారు. గృహ నిర్మాణాలను విధిగా నమోదు చేయాలని ఆదేశించారు. అవినీతికి తావు లేకుండా పన్నులు వసూళ్లు చేయాలని స్పష్టం చేసారు. పక్కా భవనాల యజమానుల నుండి నీటి పన్ను, ఇంటి పన్ను వసూళ్లపై ఎంపిడిఓలు, పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం మెరుగు పరచాలన్నారు. జెన్కో అధికారులు రూ.11 లక్షలు పన్ను చెల్లించాలని అధికారులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకుని రాగా నోటీసు జారీ చేసి పంచాయతీ చట్టం ప్రకారం పన్నులు వసూళ్ళు చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు కొంత మంది ముఖ హాజరు నమోదు చేయలేదని, అటువంటి వారి జీతాలు నిలుపుదల చేయాలని ఎంపిడిఓలకు సూచించారు. గ్రామ సచివాలయం సిబ్బంది సమయ పాలన పాటించకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం సచివాలయాలను ఏర్పాటు చేసిందన్నారు. గిరిజన గ్రామాలకు, పంచాయతీలకు, పాఠశాలలకు, కళాశాలలకు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ఇంటర్‌ నెట్‌ సదుపాయం కల్పించడానికి నిర్దేశించిన నమూనాలో నివేదించాలని ఎంపిడిఓలకు ఒక ప్రో ఫ్రార్మాను అందజేసారు. మహిళా పోలీసులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలన్నారు. పౌష్టికాహారం లోపంతో బాధపడే చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళా పోలీసులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఎంపిడిఓలకు సూచించారు. సామాజిక పింఛన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు.
ఐటిడిఏ పిఓ రోణంకి గోపాలక్రిష్ణ మాట్లాడుతూ, తాగునీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. తాగునీటి బోరులు, కుళాయిలు, ట్యాంకర్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తాగునీటి నాణ్యత పరీక్షలు చేయించాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇఇ లీలా క్రిష్ణ, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, డివిజనల్‌ పంచాయతీ అధికారి పి.ఎస్‌ కుమార్‌, 11 మండలాల ఎంపిడిఓలు, ఎపిఇపిడిసిఎల్‌ ఇఇ ఎవి.ఎన్‌. అప్పారావు, డిఇలు డి. భాస్కరరావు, సత్యనారాయణ, గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఇలు, ఎఇలు తదిరులు పాల్గొన్నారు.