ప్రజాశక్తి-అనకాపల్లి
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి గొర్లి సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ముందుగా కుంచంగి ఎంపీటీసీ సభ్యులు పల్లేల శివ మతికి కొద్దిసేపు సంతాపం ప్రకటించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సభ్యులు తమ తమ గ్రామాల సమస్యలను సమావేశంలో తెలియజేస్తే వాటి పరిష్కారానికి కావలసిన నిధులను అందజేస్తామని చెప్పారు. గ్రామాలకు అప్రోచ్ రోడ్లు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనకాపల్లి కొత్తూరు నుంచి రావికమతం వరకు కేబి రోడ్డును రూ.32 కోట్లతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే తుమ్మపాల -చోడవరం రోడ్డు పనులు చేపడతామన్నారు. మండల శాఖ అధికారులు తమ తమ శాఖల పనితీరును వివరించారు. మెజారిటీ సభ్యులు డ్రైనేజీ, రోడ్లు, ఇంటింటికి కులాయిలు, తాగునీటి సమస్యలపై సుమారు రెండు గంటలసేపు వివరించారు. ఈ సమావేశంలో పిఆర్‌డిఈ వేణుగోపాల్, డిప్యూటీ తహశీల్దారు శ్రీరామ్మూర్తి, ఇన్చార్జ్ ఎంపీడీవో ధర్మారావు, ఎన్టీఆర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్, వైస్ ఎంపీపీలు విల్లూరి సూర్య కుమారి శేఖర్, అయిత ఆనంద రాము, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










