తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు : ఎంపిపి
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్
మండలంలోని 20 గ్రామ పంచాయతీలు మూడో గిరిజన గూడెం లలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి తెలిపారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ సమావేశపు భవనంలో పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. మండలంలో ఏ గ్రామ పంచాయతీలో కూడా తాగునీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి రాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చేతిపంపులు, ఓవర్ హెడ్ ట్యాంకులు, డైరెక్ట్ పంపింగ్ మోటార్లకు ఎక్కడైనా సమస్యలు ఉంటే మరమ్మతులు చేయాలన్నారు. అధికారులు గ్రామ పంచాయతీలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఉమారాణి, ఎంపీడీవో వాసుదేవగుప్త, ఈఓఆర్‌డి శ్రీనివాసులు, పరిపాలన అధికారి అనీఫ్ర్ ఖాన్, హౌసింగ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










