Jul 13,2023 21:41

కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పి అగ్రహారంలో తాగునీటి చెరువు పక్కన చేపల చెరువు తవ్వకం
తాగునీటి వనరులను కాపాడుకునేందుకు జనం పోరుబాట
నిలదీస్తున్న గ్రామస్తులపై అక్రమ కేసుల బనాయింపు
కోర్టు స్టే ఉన్నా అధికార బలంతో ముందుకు
ఎంఎల్‌ఎ కనుసన్నల్లోనే అంతా అంటూ విమర్శలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

         డెల్టాలో తాగునీటి వనరులన్నీ కలుషితమైపోయాయి. గుక్కెడు నీళ్ల కోసం జనం పాట్లు వర్ణనాతీతంగా మారాయి. ఆక్వా చెరువుల కాలుష్య నీటితో కేన్సర్‌, కిడ్నీ సమస్యలు జనాన్ని వెంటాడుతున్నాయి. దీంతో మా గ్రామంలో ఉన్న ఒక్క తాగునీటి చెరువునీ దెబ్బ తీయొద్దంటూ కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పి అగ్రహారం ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. చెరువు తవ్వకూడదని కోర్టు స్టే ఉన్నా అధికార బలంతో ముందుకు సాగుతున్న నాయకులను అడ్డుకోకుండా అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితం కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా సాగించిన చేపల చెరువుల తవ్వకాలతో డెల్టా ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. ఇక అక్కడక్కడా మిగిలి ఉన్న తాగునీటి చెరువులను సైతం ధ్వంసం చేసేందుకు అడ్డగోలుగా చేపల చెరువుల తవ్వకాలకు అధికార పార్టీ నాయకులు పూనుకున్నారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సీతారామపురం అగ్రహారంలో నెలకొన్న పరిస్థితే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఎస్‌ఆర్‌పి అగ్రహారంతోపాటు చుట్టుపక్కల ఉన్న కట్టావారిపాలెం, పరసావానిపాలేనికి చెందిన మూడు వేల మందికి ఉపయోగపడే ఏడెకరాల తాగునీటి చెరువు అది. అక్కడ ఉన్న పంపుల ద్వారా వచ్చే నీటిని తాగునీటికి, చెరువులో నీటిని రోజువారీ అవసరాలకు అక్కడి ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. తాగునీటి చెరువులకు సమీపంలో చేపల చెరువులు తవ్వకూడదని నిబంధనలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో కొంతమంది నిబంధనలు తుంగలో తొక్కి తాగునీటి చెరువు పక్కనే 30 ఎకరాల్లో చేపల చెరువు తవ్వేందుకు పూనుకున్నారు. దీన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనకు దిగి తహశీల్దార్‌కు సైతం వినతిపత్రం అందించారు. చేపల చెరువు తవ్వకం నిలుపుదల చేయాలని కోర్టు స్టే సైతం ఇచ్చింది. అయినప్పటికీ చేపల చెరువు తవ్వి తీరుతామన్నట్లు చెరువు తవ్వకందారులు వ్యవహరిస్తున్నారు. ఇదంతా స్థానిక ఎంఎల్‌ఎ అండతోనే జరుగుతుందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేపల చెరువుతవ్వకం వద్దంటూ ఆందోళనకు దిగిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్తుల మధ్య చిచ్చుపెట్టి తమ చేపల చెరువు తవ్వకం పని పూర్తి చేయాలనే దుర్మార్గపు ఆలోచనలు సైతం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చేపల చెరువు పూర్తయితే ఏడెకరాల తాగునీటి చెరువు పూర్తిగా కలుషితం కానుంది. భవిష్యత్తులో వాడకానికి కూడా నీళ్లు లేకుండా పోనున్నాయి. అదే జరిగితే మూడు వేల మంది ప్రజానీకం పరిస్థితి అత్యంత భయానకంగా మారనుంది.
ప్రేక్షక పాత్రలో అధికారులు
ఎస్‌ఆర్‌పి అగ్రహారంలో తవ్వుతున్న చేపల చెరువుతో తాగునీటి చెరువు ధ్వంసం అవుతుందంటూ ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమవుతున్నారు. కోర్టు స్టే ఉన్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నాయకులకు చట్టాలు వర్తించవా అంటూ అంతా ప్రశ్నిస్తున్నారు. తమ గ్రామ సమస్యపై ఆందోళన చేసే ప్రజలపై అక్రమ కేసులు పెట్టడం అత్యంత దారుణమనే చర్చ సాగుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని తాగునీటి చెరువును కాపాడాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
తాగునీటి చెరువు పక్కన చేపల చెరువు తవ్వకంపై చర్యలు తీసుకోవాలి
ఎస్‌.మహంకాళిరావు, సిపిఎం మండల కార్యదర్శి
మండలంలో చాలా గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి చెరువులు దెబ్బతిన్నాయి. ఫౌండేషన్‌ నీరు కొనుగోలు చేస్తేనే గొంతు తడిచే పరిస్థితి ఉంది. తాగునీటి కాలుష్యంతో కేన్సర్‌, కిడ్నీ వంటి రోగాలు పెరుగుతున్నాయి. ఎస్‌ఆర్‌పి అగ్రహారంలో తాగునీటి చెరువు పక్కన చేపల చెరువు తవ్వకుండా అధికారులు చర్యలు తీసుకుని తాగునీటి వనరులను కాపాడాలి.