ప్రజాశక్తి -యు.కొత్తపల్లి ఉప్పాడ పంచాయతీ పరిధిలో తాగునీరందక మత్స్యకారులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని టిడిపి అధికార ప్రతినిధి, మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్.వర్మ అన్నారు. గురువారం ఉప్పాడ పంచాయతీ పరిధిలోని సుబ్బంపేట, కొత్తపట్నం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార మహిళలు గ్రామాల్లో తాగునీరు సక్రమంగా రావడం లేదని, అప్పుడప్పుడు వాటర్ ట్యాంకులు పంపి చేతులు దులుపు కుంటున్నారన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వేసవికాలంలో తాగునీరు అందించేందుకు ప్రభుత్వం బడ్జెట్ ఉంటుందని ఆ సొమ్మును తాగునీరు పేరిట తినేస్తున్నారన్నారు. తీర ప్రాంతంలో అధిక శాతం మత్స్యకారులే కావడంతో నీటిని ఆర్‌ఒ ప్లాంట్లలో కొనుగోలు చేయలేక కలుషిత నీటిని తాగి ఆసుపత్రుల పాలవుతున్నారని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్ దష్టి సారించి ఉప్పాడ పంచాయతీ పరిధిలో తాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు










