Oct 16,2023 21:54

ధర్నా చేస్తున్న గుత్తి బీసీ కాలనీవాసులు

          ప్రజాశక్తి-గుత్తి   పట్టణంలోని బీసీ కాలనీకి తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాలనీవాసులు సోమవారం ధర్నా నిర్వహించారు. బీసీ కాలనీ నుంచి మహిళలు ఖాళీ బిందెలతో ప్రదర్శనగా గాంధీ కూడలికి చేరుకుని అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్య పరిష్కరించేంత వరకూ ఆందోళన విరమించమని భీష్మించుకుని కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్‌ డిఇఇ రఘు,ఎఇ సాయినాథ్‌ బాబు, వైసీపీ పట్టణ కన్వీనర్‌ డి. హుస్సేన్‌పీరా అక్కడికి చేరుకుని చర్చించారు. సమస్య పరిష్కారాన్ని చర్యలు చేపడతామని మున్సిపల్‌ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మద్దిలేటి, జనసేన నాయకుడు పాటిల్‌ సురేష్‌, రామేశ్వరమ్మ, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.