May 14,2023 00:02

మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి చిన్నబాబు

ప్రజాశక్తి-విఆర్‌.పురం
మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, కరెంటు సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు డిమాండ్‌ చేశారు. మండలంలోని రేకపల్లి సిపిఎం కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మూడేళ్ల నుండి దర్బలంక, సున్నంమట్కా గ్రామంలో నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే అధికారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి స్టిక్కర్లు అతికించటం కాదని, ప్రజల సమస్యలను పరిష్కరిచాలని కోరారు. పెద్ద మట్టపల్లి నుండి వెంకంపాలెం వరకు రోడ్లు గోతులు పడి ఉన్నాయని, రాత్రి సమయంలో ఆస్పత్రులకు వెళ్లాలన్న నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సున్నంవారి గూడెం, చిన్నమటపల్లి, ములకనపల్లి పంచాయతీల పరిధిలో తాగునీటి పథకాలను పునరుద్ధరించాలని కోరారు. దర్భలంక, సున్నం మట్కా గ్రామాలకు రోడ్డు, కరెంటు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పంకు సత్యనారాయణ, పులి సంతోష్‌ కుమార్‌, కె.సత్యనారాయణ, రమేష్‌, కుంజ నాగిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.