Oct 10,2023 21:44

సిపిఎం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు

ప్రజాశక్తి -కొమరాడ ;  మండల కేంద్రంలో ప్రజలకు తాగునీరిచ్చే వరకూ నిరసన కార్యక్రమం చేపడతామని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక గ్రామ సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో మహిళలతో కలిసి తాగునీరు అందించాలని కోరుతూ నిరసన చేపట్టారు. అనంతరం సాంబమూర్తి, రజిక వీధికి చెందిన పెంట లక్ష్మి (నారాయణమ్మ), గడ్డెమ్మ మాట్లాడుతూ రజక వీధుల్లో 20 రోజులుగా తాగునీరు రావడంలేదని, మంచినీరు బోర్లు గానీ, జలజీవన్‌ ద్వారా గానీ మంజూరు చేసిన పైపులు నుండి గానీ నీరు పూర్తిస్థాయిలో రాకపోవడంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అన్నారు. కొన్ని రోజుల పాటు రెండు రజక విధులకు చెందిన ప్రజలు నీరు పూర్తి స్థాయిలో అందక ఇబ్బంది పడుతుంటే కనీసం సచివాలయం సిబ్బంది పరిశీలించకపోవడం అన్యాయమని అన్నారు. కావున వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని జలజీవన పథకం ద్వారా గానీ, పాత కొళాయి నుండి బోరుల ద్వారా గానీ తాగునీరందించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రజక వీధి మహిళలు, పాత బిసి కాలనీకి చెందిన మహిళలు పాల్గొన్నారు.