Jun 07,2023 23:23

పద్మశాలీ బజారులో కొండపైకి వెళ్లే మెయిన్‌ పైపులైన్‌కు పగులుతో వృథాగా పోతున్న తాగునీరు

తాడేపల్లి: తాగునీరు చాలా విలువైంది. బొట్టుబొట్టు ఒడిసి పట్టుకోండి అంటూ ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది. ఆచరణలో ఇందుకు భిన్నంగా పట్ట ణంలో పరిస్థితులు కనబడుతున్నాయి. పట్టణంలోని పద్మశాలీ బజారులో కొండపైకి వెళ్లే మెయిన్‌ పైపులైన్‌ పగులిచ్చింది. దీంతో తాగునీరు వృథాగా డ్రెయినేజీ నీటిలో కలుస్తుంది. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడంలేదు. దీంతో స్థానికులే పైపు పగిలిన చోట రబ్బరు తాడు చుట్టి కొంత లీకేజీని నిరోధించగలిగారు. అయినా అధిక శాతం మంచినీరు డ్రెయినేజీలో కలుస్తూనే ఉంది. దీని వల్ల పలువురికి సక్రమంగా మంచినీరు అందడంలేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పైపులైన్‌కు మరమ్మతులు చేసి వృధాగా పోతున్న మంచినీటిని అరికట్టి నీరు అందే విధంగా చూడాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఎఇ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.