
ప్రజాశక్తి - పాలకొల్లు
తాగునీరు అందించాలని పాలకొల్లు బైపాస్ రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుక జర్నలిస్ట్ కాలనీలోని బలహీన వర్గాల ప్రజలు కోరారు. ఈ మేరకు ఆదివారం కాలనీ వద్ద మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కొంతకాలంగా సీనియర్ జర్నలిస్టు కాగిత సూర్యనారాయణ తన సబ్ మెర్సిబుల్ పంపు నుంచి తాగునీరు ఇచ్చేవారన్నారు. అయితే ఇటీవల మోటార్ కాలిపోవడంతో తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. తమ సమస్య పరిష్కరించాలని రూరల్ పంచాయతీ కార్యదర్శిని అడిగితే పంచాయతీ విలీనమైందని, మున్సిపల్ కమిషనర్‌ను అడగాలని చెబుతున్నారన్నారు. కమిషనర్‌ను అడిగితే ఇంకా విలీనం కాలేదని చెబుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు వద్దకు వెళ్లగా కొన్ని రోజులు వాటర్ ట్యాంక్ పంపుతానని, శాశ్వత పరిష్కారం అధికారులు చేయాలని చెప్పారని తెలిపారు. దీంతో మహిళలు తమ సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.