Nov 06,2022 23:25

దోడిపుట్టులో ప్రజలతో మాట్లాడుతున్న గిరిజన సంఘం నేతలు

ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
గ్రామాల సందర్శనలో గిరిజన సంఘం నేతలు
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు
:తాగు, సాగునీటికి గిరిజనం ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వం, అధికారులకు పట్టడం లేదని గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు కొర్ర డొంబ్రు, పాంగి భీమరాజు విమర్శించారు. ఆదివారం మండలంలోని దోడిపుట్టు పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోడిపుట్టు గ్రామలో కూరగాయలు పండించే గిరిజన రైతులకు సాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామ సమీపంలోని గెడ్డలోని నీటిని ఇక్కడ పొలాలకు అందించేందుకు వీలుగా కనీసం మినీ లిప్ట్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. పాంగి భీమరాజు మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలలో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం, అధికారుల పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతులకు తాగు, సాగునీరు అందించేందుకు ప్రభుత్వపరంగా ఐటిడిఎ, ఇతర అధికారులు చర్యలు చేపట్టాలని, లేకుంటే మండలపరిషత్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దోడిపుట్టు రైతులు, ప్రజలు పాల్గొన్నారు.