తాడిపత్రి : తాడిపత్రిలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డ్రెయినేజీ కాలువల నిర్మాణపై వాదప్రతివాదనలు జరుగుతున్నాయి. స్వప్రయోజనాల కోసం తాడిపత్రిలో అధికార పార్టీ నాయకులు అండర్ డ్రెయినేజీ పనులకు ఆటంకాలు కల్పిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జెసి.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం పట్టణంలోని ప్రధాన రహదారిపై నిల్వ ఉన్న డ్రెయినేజీ నీటిలో టిడిపి మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని బిందెల కాలనీలో ఎమ్మెల్యే తన ప్రయోజనాల కోసం అండర్ డ్రైనేజీలోకి ఓపెన్ డ్రెయినేజీని కలిపారన్నారు. తద్వారా అండర్ డ్రెయినేజీ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చి, రోడ్డుపైకి మురుగునీరు చేరుతోందన్నారు. అండర్ డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ ఏమాత్రం సహకరించగాలేదన్నారు. కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నేడు నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు.
ప్రభాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా వైసిపి శ్రేణుల నినాదాలు
జెసి.ప్రభాకర్‌రెడ్డి ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వైసిపి శ్రేణులు చేరుకున్నాయి. జెసి.ప్రభాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ గంగయ్య, పట్టణ సిఐ హమీద్ ఖాన్‌లు అక్కడికి చేరుకున్నారు. జెసి.ప్రభాకర్ రెడ్డితో మాట్లాడారు. రోడ్డుపై నిలిచిన నీటి సమస్య పరిష్కరించేందుకు రెండు గంటల నుంచి మున్సిపల్ సిబ్బంది పని చేస్తున్నారని, సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ప్రభాకర్‌రెడ్డితో నిరసన విరమింపజేశారు.