Apr 29,2023 00:28

నిరసన తెలుపుతున్న చిన్న తాడి గ్రామస్తులు

ప్రజాశక్తి -పరవాడ
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని, తాడి గ్రామాన్ని తరలించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం చిన్న తాడి గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ 2022 ఏప్రిల్‌ 28 పైడివాడ అగ్రహారంలో పట్టాల పంపిణీ సందర్భంగా తాడి గ్రామాన్ని 15 రోజుల్లో తరలిస్తామని హామీ ఇచ్చారని, నేటికీ సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ తరలించలేదని పేర్కొన్నారు. తరలించే చర్యలు చేపట్టకుండా ఇప్పుడు మరో కాలుష్య కుంపటిని గ్రామంపై పెట్టడానికి ఫిల్లింగ్‌ కోసం 50 ఎకరాలకు స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం దారుణమన్నారు. వెంటనే ఫిల్లింగ్‌ నిమిత్తం కేటాయించిన 50 ఎకరాల స్థలాన్ని రద్దు చేయాలని, గ్రామాన్ని వెంటనే తరలించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఇంటికి ధర కట్టాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. రాంకీ యాజమాన్యం చర్యల వల్లనే గ్రామం కాలుష్యం ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. గ్రీన్‌ బెల్ట్‌ బఫర్‌ జోన్‌ నిబంధనలు ఉల్లంఘించి పరిశ్రమలకు భూములను అమ్మకాలు చేసిన రాంకీ యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా యాజమాన్యానికి మద్దతుగా నిలవడం దారుణమన్నారు. గ్రామాన్ని తరలించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుర్రం నూకరాజు, కే రాము, పి సత్యవతి, జి నరసింహ, జి లక్ష్మి , సింధు, సత్తిబాబు పాల్గొన్నారు.