ప్రజాశక్తి-గుంటూరు : తాడేపల్లి మండలంలోని ప్రజలెదుర్కొనే వివిధ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు కోరారు. ఈ మేరకు కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డిని గురువారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. వడ్డేశ్వరం, కొలనుకొండ గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా పేదలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకుని నివాసముంటున్నారని, వారికి పట్టాలు మంజూరు చేయాలని, చిర్రావూరులో దళితులకు శ్మశాన స్థలం కేటాయించాలని కోరారు. గ్రామంలో పశుసంపద ఎక్కువగా వుందని, ఆశుపత్రికి పక్కాభవనం వున్నా డాక్టరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వెంటనే డాక్టర్‌ను కేటాయించాలని కోరారు. గుండిమెడలో తాగునీటి సమస్య వుందని, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి తాగునీరు అందించాలన్నారు. అపార్ట్‌మెంట్స్ నిర్మాణాలు పెరిగిపోయాయని, భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా వుందన్నారు. భూగర్జ జలాలు కలుషితమవుతున్నాయని, భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను నిర్మాణం చేయాలని కోరారు. అర్హులైన పేదలను గుర్తించి 3 సెంట్లు ఇళ్ల స్థలాలివ్వాలని, హామీ పత్రాలు ఇచ్చిన వారికి వెంటనే ఆయా గ్రామాలలోని ఇళ్ల స్థలాలివ్వాలని కోరారు. ప్రాతూరు, చిర్రావూరు, గుండిమెడ ఇసుక క్యారీలను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రేవేంద్రపాడు వంతెన శిధిలావస్థలో వుందని అనేక గ్రామాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారని, కొత్తవంతెన నిర్మాణం చేయాలని కోరారు. మెల్లెంపూడి నుండి నూతక్కి రోడ్డు విధిలావస్థలో వుందని వెంటనే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. తాడేపల్లి రూరల్ మండలాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, నాయకులు పి.కృష్ణ, బి.శ్యాంశాన్, బి.గోపాలరావు, పి.సుబ్బారావు, కె.స్వాతి ఉన్నారు.
మద్దతు ధరకు పసుపు కొనుగోలు చేయాలి
పసుపు పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనగోలు చేయాలని కలెక్టర్‌కు రైతు సంఘం నాయకులు వినతిసత్రం ఇచ్చారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ ఏడాది అకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గిందని, ఎకారాకు కౌలుతో సహా రూ.2 లక్షలు ఖర్చవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర, క్వింటాళ్‌కు రూ.6850 ఉండగా ప్రైవేటు వ్యాపారులు కేవలం రూ.5000కే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ ఖర్చు పెరగడంతో మద్దతు ధర కనీసం రూ.10వేలు నిర్ణయించాలని కోరారు.










