ప్రజాశక్తి-తాడేపల్లి : రాజధాని అమరావతిలో రాష్ట్రప్రభుత్వం పెద్దఎత్తున ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తాడేపల్లి పట్టణంలో సుమారు 6,540 మందికి ఇళ్లస్థలాలు ఇచ్చి పట్టాలు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. పట్టాలిచ్చి స్థలాలు అప్పజెబుతారా అనే సందిగ్ధం లబ్దిదారుల్లో నెలకొంది. మూడేళ్ల కిందట తాడేపల్లి పట్టణంలో ఇళ్లపట్టాల పేరుతో సిఎం జగన్ బొమ్మతో సుమారు ఆరు వేల మందికి హామీపత్రాలు ఇచ్చారు. అలా ఇచ్చిన వారి పేర్లు కూడా నేడు లబ్దిదారుల జాబితాలో ఉన్నాయో లేదో తెలియడంలేదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా సీతానగరంలో ఇళ్లు తీసేసిన బాధితులందరికీ 245 మందికి ప్రస్తుతం పట్టాల పంపిణీలో న్యాయం జరుగుతుందా? అనేది స్థానికులను వేధిస్తున్న ప్రశ్న. తాడేపల్లిలో ఇటీవల కొండ చుట్టూ ఉన్న 291 సర్వే నెంబర్‌ను 15 జోన్లుగా విభజించి లబ్దిదారులను గుర్తించారు. వారందరికీ ప్రస్తుతం ఇళ్లపట్టాలు అందజేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
తాడేపల్లి పట్టణంలో ఇరిగేషన్, కొండ పోరంబోకు, ఫారెస్టు ప్రాంతాల్లో సుమారు పది వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరందరినీ ఖాళీ చేయించి వేరే చోట పట్టాలు ఇస్తే ఇప్పుడున్న తాడేపల్లిలో మూడొంతుల భాగం ఎగిరిపోతుంది. పై ప్రాంతాల్లో నివశిస్తున్న వారిని పట్టాల పంపిణీ కార్యక్రమం ఉందని, సభకు రావాలని, బస్సులు పెడుతున్నామని ప్రభుత్వ అధికారులు కిందిస్థాయి సిబ్బంది చేత చెప్పిస్తున్నారు. ఇది సభను జయప్రదం చేయడానికి, పట్టాలు ఇవ్వడానికా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇవిగాక రైల్వే స్థలాల్లో 1900 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. వీరందరినీ రెగ్యులరైజేషన్ చేసి పట్టాలిచ్చి అక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. వీరి సంగతేమిటో కూడా అంతుపట్టకుండా ఉంది. వీరందరికీ పట్టాలిస్తారా, సెంటు భూము ఇస్తారా? అని సందేహాలు నెలకొన్నాయి. భూములు తీసుకోవడానికైతే వీరు ఇష్టపడటంలేదు. ప్రభుత్వ, రెవెన్యూ, పోరంబోకు, రైల్వే స్థలాల్లో నివాసముంటున్న వారికి అక్కడే ఉండే విధంగా రెగ్యులరైజేషన్ చేసి పట్టాలివ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 40 ఏళ్ల నుంచి నివాసముంటున్న తాము ఇల్లు నిర్మించుకుని ప్రభుత్వం అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించిన తరువాత వేరే ప్రాంతంలో స్థలాలు అక్కర్లేదనే వాదన వినిపిస్తోంది. కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలిచ్చి క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
ప్రతి కుటుంబానికి రెండు సెంట్లు ఇవ్వాలి : సిపిఎం
ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న ఇళ్లస్థలాలకు సంబంధించి ప్రతి కుటుంబానికి రెండు సెంట్లు భూమి ఇచ్చి వారికి పట్టా ఇవ్వాలని సిపిఎం పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఆ మేరకు మంగళవారం దొంతిరెడ్డి శ్రీనివాసకుమారి అధ్యక్షతన జరిగిన సిపిఎం పట్టణ కమిటీ సమావేశం తీర్మానించింది. ఫారెస్టు, కొండ పోరంబోకు, పిడబ్ల్యుడి, అసైన్డ్ భూముల్లో నివాసం ఉంటున్న వారికి స్థలాలను రెగ్యులరైజేషన్ చేసి వారికి పట్టాలివ్వాలని డిమాండ్ చేసింది. రైల్వే స్థలాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రెగ్యులరైజేషన్ చేయాలని కోరింది. కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇళ్ల లబ్దిదారులకు కూడా గతంలో ప్రభుత్వ అధికారులు సర్వే చేసిన దాని ప్రకారం ఆ స్థలాలను అక్కడే రెగ్యులరైజేషన్ చేసి పట్టాలివ్వాలని కోరింది. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు కె.కరుణాకరరావు, వి.దుర్గారావు, కె.మేరి, డివి భాస్కరరెడ్డి, బాబూరావు, ఎం.శ్రీనివాసరెడ్డి, శాస్త్రి పాల్గొన్నారు.










