Jul 31,2021 17:31

అస్సాంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్‌ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నిన్న (శుక్రవారం) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సుశాంత రాజీనామాను అస్సాం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎపిసిసి) కార్యదర్శి అపుర్బ కుమార్‌ ఈరోజు (శనివారం) ఉదయం ఆమోదించారు. అయితే, సుశాంత బోర్గోహైన్‌ రాజీనామా వ్యవహారంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పాలంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు భూపేశ్‌ భోరా.. సుశాంత బోర్గోహైన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అతడిపై న్యాయ పరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు భోరా తెలిపారు. సుశాంత బోర్గోహైన్‌ ఎగువ అస్సాంలోని థౌరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌ను వీడటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.