ప్రజాశక్తి-రాజవొమ్మంగి : జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం ద్వారా ఏజెన్సీలోని భూములన్నిటికీ సర్వే నిర్వహించడం జరుగుతుందని రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. శనివారం రంపచోడవరం మండలం పెదపాడు గ్రామంలో జగనన్న శాశ్వత భూ హక్కు,భూ రక్ష పథకం ద్వారా భూములు సర్వే చేసే కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రైతులతో పెదపాడు గ్రామంలో సబ్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ, పెదపాడు, ధారగూడెం, గిన్నె పల్లి గ్రామాలలో సర్వేయర్లు,గ్రామ రెవెన్యూ అధికారులు వీఆర్ఏలు తదితరులతో టీములు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ టీముల ద్వారా గ్రామాలలోని అన్ని భూములకు సర్వే నిర్వహించి రైతులకు సంబంధించిన భూములలో హద్దులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సర్వే చేయుటకు ఎవరికైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సబ్ కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్, కె.దేవేంద్రుడు, తాహాశీల్డార్.పి ఎన్ వి,ప్రసాద్, విఆర్ఓ లు,ఎం. ఆనంద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.










