Jul 31,2021 21:45

న్యూఢిల్లీ : అప్పీళ్లు దాఖలు చేయడంలో జాప్యం చోటుచేసుకోకుండా పాలనాపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు శనివారం సిబిఐని ఆదేశించింది. పర్యవేక్షణను సులభతరం చేసేందుకు ఐటి ఆధారిత మానిటరింగ్‌ యంత్రాంగాన్ని అనుసరించాలని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. గతేడాది జూన్‌లో చత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సిబిఐ 647 రోజుల ఆలస్యంగా అప్పీల్‌ దాఖలు చేయడాన్ని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇందుకుగానూ సిబిఐ అధికారుల వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని స్పష్టం చేసింది. ఒక అవినీతి కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించాన్ని వ్యతిరేకిస్తూ సిబిఐ పిటిషన్‌ దాఖలు చేయడంలో ఆలస్యం అయినందున, అప్పీల్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. ''భవిష్యత్తులో ఈ విధంగా జాప్యం చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబిని ఆదేశిస్తున్నాం. నిర్ణీత కాలవ్యవధిలో అప్పీల్‌ దాఖలు చేయడంలో సంబంధిత అధికారుల ఆలస్యం తీవ్రమైన అనుమానాలకు కారణమౌతోంది'' అని ధర్మాసనం ఈ సందర్భంగా వెల్లడించింది. అప్పీలు దాఖలు చేయడంలో చోటుచేసుకున్న ఆలస్యానికి కరోనాను చూపడం సరికాదని, హైకోర్టు 2019 జూన్‌లో తీర్పునివ్వగా కరోనా ప్రభావం 2020 మార్చిలో ప్రారంభమైందని పేర్కొంది.