- అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు, ఆయన భార్యపై కేసు నమోదు
- ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన
ప్రజాశక్తి-తిరుచానూరు : చీటి డబ్బులు ఇవ్వకుండా ఏళ్ల తరబడి వేధిస్తున్న చీటి నిర్వాహకులు తీరుతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుచానూరు పంచాయతీ ఎస్వీపి కాలనీలో చోటుచేసుకుంది. తిరుచానూరు పంచాయతీ ఎస్వీపి కాలనీకి చెందిన నితిన్ సింగ్ స్థానికంగా ప్రొవిజన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన అవసరాల నిమిత్తం ఇంటి పరిసరాల్లో నమ్మకంగా చీటిలు నిర్వహిస్తున్న వాణి, ఆమె భర్త ప్రతాప్ స్వామి అలియాస్ బాబు స్వామి(అమ్మవారి ఆలయం ప్రధాన అర్చకులు ) వద్ద పెద్ద మొత్తంలో చీటీలు వేసాడు. చీటీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నా తనకు రావాలిసిన డబ్బులు ఇవ్వకుండా దంపతులు ఇద్దరు రోజుకో మాట చెబుతుండేవారు. దీంతో అడిగి అడిగి విసిగి వేసారిన నితిన్ మనస్తాపం చెంది తన చావుకు కారణం చీటి నిర్వహిస్తున్న దంపతులే కారణమంటూ లేఖ రాసి తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సోమవారం తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు.










