
పాతబస్తీ : అన్నతో నిశ్చితార్థం.. తమ్ముడితో పెళ్లి.. తిరిగొచ్చిన అన్న వేధింపులు.. కట్నకానుకల కోసం అత్తమామల వేధింపులు.. చివరికి ఆ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. బాలాపూర్ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇన్‌స్పెక్టర్ భాస్కర్ కథనం మేరకు... పాతబస్తీ వట్టెపల్లికి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిన్‌బేగం (25) తో జల్‌పల్లి న్యూబాబానగర్ నివాసి మీర్ ఇస్మాయిల్‌ఉద్దీన్ అలీ అన్నయ్యతో మూడేళ్ల క్రితం నిశ్చితార్థమయ్యింది. అన్నదమ్ములిద్దరూ ఉపాధి పనుల కోసం దుబాయికి వెళ్లారు. కరోనా కర్ఫ్యూ వేళ... మీర్ ఇస్మాయిల్ ఉద్దీన్ అన్నయ్య ఇంటికి రాలేదు. నెలన్నర క్రితం తమ్ముడు ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ తిరిగి ఇంటికొచ్చాడు. పెద్ద కుమారుడి ఆచూకీ లేకపోవడంతో రెండు కుటుంబాల పెద్దలు మాట్లాడుకొని షాహిన్‌బేగంను ఇస్మాయిల్ ఉద్దీన్ అలీకి ఇచ్చి జులై 12 న వివాహం చేశారు. ఇంతలో... అన్న తిరిగి ఇంటికొచ్చాడు. తనకు నిశ్చితార్థం అయిన అమ్మాయితో తన తమ్ముడికి పెళ్లి జరిగిందంటూ మానసికంగా మదనపడేవాడు. ఆమెను మానసికంగా వేధించేవాడు. ఇదిలా ఉండగా.. మరోవైపు అత్తమామలు షాహిన్‌బేగంను కట్నకానుకల కోసం తీవ్రంగా వేధించేవారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన షాహిన్ బేగం గత శనివారం తన గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మఅతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.