- విద్యాశాఖ అధికారి డాక్టర్ వి.శేఖర్
ప్రజాశక్తి - క్యాంపస్ : కౌమార దశలోని పాఠశాల విద్యార్థులకు జీవన నైపుణ్యాలను నేర్పించండి అని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి.శేఖర్ పేర్కొన్నారు. స్థానిక ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న మూడు రోజుల జీవన నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వివిధ వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగానే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికై మ్యాజిక్ బస్సు ఫౌండేషన్ వారి సహకారంతో కౌమార దశలోని పాఠశాల విద్యార్థులకు జీవన నైపుణ్యాలను నేర్పించడానికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. తిరుపతి జిల్లాలో ఎంపిక చేయబడిన 50 ఉన్నతం పాఠశాలల నుంచి వ్యాయామ ఉపాధ్యాయునితో సహా మరొక ఉపాధ్యాయుని చొప్పున మొత్తం 100 మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ పాఠశాలల్లోని విద్యార్థులలో జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు బైజుస్ టాబ్ ల పంపిణీ, అమ్మ ఒడి, ఇంటర్ ఆక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ఇంగ్లీష్ మీడియం, టోఫెల్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వీటి ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తయారు చేయాలని పిలుపునిచ్చారు. జీవన నైపుణ్య శిక్షణలో భాగంగా ఆటలు కృత్యాల నిర్వహణ ద్వారా అనుభవ పూర్వక బోధనా పద్ధతులను ఉపయోగించి విద్యార్థులలో జీవన నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బాబు,రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ పరిశీలకులు కె.సతీష్ బాబు, డైట్ అధ్యాపకులు మరియు స్టేట్ రిసోర్స్ గ్రూప్ సభ్యులు బి. చెంగల్రాజు, ఆర్. ప్రభాకర్, శ్రీనివాసులు రెడ్డి, రెడ్డివెంకటరమణ, వ్యాయామ ఉపాధ్యాయులు డాక్టర్ ప్రభాకర్ రావు, భార్గవి, మ్యాజిక్ బస్ రీజినల్ మేనేజర్ ఇగ్నీషియస్, మ్యాజిక్ బస్సు జిల్లా స్కూల్ సపోర్ట్ ఆఫీసర్ ప్రియదర్శిని, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










