May 15,2023 19:09

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రోజంతా లాభాల బాట పట్టాయి. సోమవారం ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అలాగే పయనించాయి. దీంతో వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలు నమోదయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ ఐదు నెలల గరిష్టం వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. స్థిరాస్తి, మీడియా రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఆసియా మార్కెట్‌ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా సూచీలు ప్రస్తుతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 62,157.10 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,562.67 దగ్గర గరిష్టాన్ని తాకింది. చివరకు 317.81 పాయింట్ల లాభంతో 62,345.71 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,339.30 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,458.90 దగ్గర గరిష్టానికి చేరింది. చివరకు 84.05 పాయింట్లు లాభపడి 18,398.85 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు పతనమై 82.31 దగ్గర నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, ఐటిసి, టెక్‌ మహీంద్రా, హెచ్‌యుఎల్‌, ఎల్‌అండ్‌టి, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. మారుతీ, టిసిఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.