
'స్త్రీకి కూడా శరీరం వుంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి మెదడు వుంది, దానికి జ్ఞానం ఇవ్వాలి...' అనే సంగతి గుర్తించని ఈ దేశానికి, నేను రాసే ఈ సంగతులు అర్థమవుతాయా? అంటాడు చలం. నాగరికత హెచ్చినకొద్దీ... పనులు, ధ్యాసలు, ఆశలు ఎక్కువైన కొద్దీ... మనుషుల్ని మనుషులుగా గుర్తించడం తగ్గిపోయింది. నాటి నుంచి నేటి వరకూ స్త్రీకి ఒక వ్యక్తిత్వాన్నివ్వలేదు మన సమాజం. పురాణాలు, ధర్మశాస్త్రాలు, మనుస్మృతి, ఇతర మత గ్రంథాలన్నీ పురుషుల కోసం రాసినవే. వాటిలో వాడిన భాష కూడా చాలావరకూ ఈ ధోరణిని ప్రతిబింబించేలాగే వుంటుంది. ప్రతి వ్యక్తీ లేచినప్పటి నుంచి ఏదోక సందర్భంలో ఊతపదాలు, మూస పదాలు, మోటుహాస్యంతో కూడిన పదాలను అలవోకగా వాడుతూ వుంటారు. ఈ పదాలలో చాలావరకూ స్త్రీలను కించపరిచేవే ఎక్కువగా వుంటాయి. ఆధునిక యుగంలోనూ ఈ తరహా మూస పదాలు, బూతుపదాలు సాధారణ పదాలుగానే చలమణీ అవుతున్నాయి. స్త్రీల దుస్థితిని ప్రతిబింబింపజేస్తూ... 'దొడ్లో గేదె వుంది, ఇంట్లో నేనున్నాను ఇంటిల్లిపాదికీ' ఆ పాత్ర చేతనే పలికిస్తాడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన 'అరికాళ్ల కింద మంటలు' కథలో. ఎస్సీ, ఎస్టీ మహిళల్లో అయితే... ఇదింకా ఎక్కువగా వుంటుంది. అగ్రవర్ణ మహిళలు కూడా వీరిపై మూస పదాలను ఎక్కువగానే ప్రయోగిస్తుంటారు. 'అగ్రవర్ణ స్త్రీలే... మా దళిత స్త్రీలకు మా మగోళ్ల కంటే, పెద్ద మగోళ్లు' అంటారు రచయిత్రి ఎంఎం వినోదిని. స్త్రీల వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని ఈ ఆధునిక యుగంలోనూ రంపపుకోతకు గురిచేస్తున్నది ఈ మూస పదాల బూతుపురాణం.
స్త్రీల పట్ల వాడకూడని పదాలు, కించపరిచే మాటలు ఇకపై చెల్లవంటూ... కోర్టుల్లో కేసుల విచారణలోనూ, తీర్పుల్లోనూ మహిళల పట్ల లింగవివక్ష లేకుండా చూసే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన ముందడుగు వేసింది. 'వేశ్య, పతిత, ఎఫైర్, హౌస్‌వైఫ్, ట్రాన్‌సెక్సువల్, వ్యభిచారం వంటి 40 పదాలను తొలగిస్తూ కొత్త హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. ఇకపై తీర్పుల్లో మహిళల పట్ల సున్నితమైన పదజాలాన్ని మాత్రమే వాడాలని ఆదేశించింది. 'కోర్టు తీర్పుల్లో మహిళలపై వివక్ష చూపే విధంగా ఉపయోగించే పదాలు సరైనవి కావు. అయితే, గత తీర్పులను విమర్శించడం ఈ పుస్తకం ఉద్దేశం కాదు. మూస పదాలు ఎలా ఆచరణలో వున్నాయో చెప్పేందుకే' అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. తీర్పుల్లో వాడే కొన్ని పదాలు లింగ వివక్షకు దారితీస్తున్నాయి. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. ఈ మూస పదాల వల్ల తెలియకుండానే స్త్రీలకు అన్యాయం జరుగుతోందని తాజా తీర్పులో వెల్లడించారు. 'నేను రాసే ఈ సంగతులు అర్థమవుతాయా?' అని 98 ఏళ్ల క్రితం చలం అన్న మాటలు... గుర్తుకొస్తాయి. అంతేకాదు, ఊతపదాల పేరుతో సమాజంలోని అన్నిరంగాల్లోనూ నిరాఘాటంగా చెలామణి అవుతోన్న పురుషాధిక్య భావజాలానికి ఈ తీర్పు ఓ హెచ్చరిక. 'స్త్రీల కన్నీటి కథలకు కారణాలు తెలుసు. వారి తరఫున వకాల్తాకే నిర్ణయించుకున్నా. స్త్రీలు మేలుకోవాలి, ఎదిరించాలి, తిరగబడాలి' అంటాడు గురజాడ.
కుటుంబంలోనైనా, సమాజంలోనైనా స్త్రీని గౌరవించలేని ఏ వ్యవస్థ అయినా అమానవీయమైనదే. సమాజ వికాసంలో పురుషునికన్నా... ముఖ్యమైన పాత్ర పోషించిన స్త్రీని, నవ నాగరికత పేరిట, కార్పొరేట్ విష సంస్కృతి ముసుగులో, సాంప్రదాయం పేరుతో ఛాందస మత మౌఢ్య సంస్కృతిలో బందీగా మార్చేశారు. మూసపదాలు, ఊతపదాలతో గాయపరుస్తున్నారు. ఈ విష సంస్కృతి నుంచి బయటపడేందుకు, సాంప్రదాయ సంకెళ్లు తెంచుకునేందుకు ఈ తాజా తీర్పు తొలి అడుగు కావాలి. చీకటిని తిట్టుకుంటూ కూర్చునేకంటే, చిరుదీపమొకటి వెలిగించాలి. అది ఇల్లైనా, సమాజమైనా... మనిషిని మనిషిగా గౌరవించాలి. పిలుపు పేరుతోనో, మాటల పేరుతోనో పురుషస్వామ్య అణచివేతల రంపపుకోతలు పూర్తిగా అంతమయ్యే రోజొకటి రావాలి. చట్టాల్లోనే కాదు... మనుషుల భావనల్లోనూ, సమాజంలోని భావజాలంలోనూ మార్పు రావాలి. స్త్రీ పురుష అసమానతలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలి. చైతన్యం... స్వేదంతో తడవాలి, రక్తంలో మరగాలి. ఈ వ్యవస్థను మరమ్మతు చేయాలి.