
- టిడిపి, జనసేన మేనిఫెస్టోపై 'ఉక్కు' కమిటీ విమర్శ
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) : టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్‌యు)ల పరిరక్షణ గురించి లేకపోవడం శోచనీయమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలో పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు బుధవారంనాటికి 1007వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో ఎస్‌ఎంఎస్-2 కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ.. 1007 రోజులుగా రాష్ట్రంలో నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఉక్కు కార్మికుల దీర్ఘకాలిక సమస్యపై మేనిఫెస్టోలో చోటు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉన్న పరిశ్రమల పరిరక్షణ ఊసేత్తకుండా, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ మూతపడితే వందలాది అనుబంధ పరిశ్రమల్లో బతుకుతున్న కార్మికులు రోడ్డును పడతారని తెలిపారు. ఉక్కు తయారీ రంగంలో ప్రయివేటు వారు చొరబడితే టన్ను ధర రూ.లక్ష అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న బొగ్గు గనులను అదానీ, అంబానీలకు ఇచ్చి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల విద్యుత్ ధరలు పెరగడమేకాకుండా బొగ్గు కొరతతో వేలాది బొగ్గు ఆధారిత పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, వి.రాజేంద్రకుమార్, జగదీష్, సత్తిరాజు, చిన్నారావు, ఆర్ అప్పలరాజు, కన్నారావు తదితరులు పాల్గొన్నారు.