Jul 09,2023 20:33

కొలంబో : శ్రీలంక అధ్యక్షుడు రణీల్‌ విక్రమసింఘె ఈ నెల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుండి రెండు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది. ఈ పర్యటనా కాలంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకునే అవకాశం వుందని ఆదివారం అధికారులు తెలిపారు. గతేడాది జులైలో దేశంలో తిరుగుబాటు నేపథ్యంలో రాజపక్సా ప్రభుత్వం వైదొలగిన తర్వాత అధ్యక్షుడుగా విక్రమసింఘె నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన భారత్‌లో జరుపుతున్న తొలి పర్యటన ఇదే. ఈ పర్యటనా వివరాలను రూపొందించేందుకు వచ్చే వారం భారత విదేశాంగ కార్యదర్శి వినరు మోహన్‌ క్వత్రా శ్రీలంక రానున్నారని డైలీ మిర్రర్‌ వార్తాపత్రిక తెలిపింది. విద్యుత్‌, ఇంధనం, వ్యవసాయ రంగాలతో సహా సముద్ర జలాలకు సంబంధించిన పలు భారత ప్రాజెక్టుల అమలును విక్రమసింఘె ఖరారు చేసే అవకాశం వుందని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు కఠినంగా వున్నప్పటికీ ఆర్థిక సంస్కరణలను విక్రమసింఘె ప్రవేశపెట్టారు. దీంతో ఆర్థికవ్యవస్థలో కొంత మెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి పర్యటన జరగనుంది. కీలకమైన విధాన చర్యల అమల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఆర్థిక పునరుద్ధరణ అనేది విక్రమ సింఘె ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే వుంది.