Jan 21,2023 16:43

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ :‌ బాలికా విద్యకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతోపాటు  స్వయంకృషి జనహిత స్వచ్ఛంద సేవా సంస్థ, రాచపాళెం వారు పలు విద్యా కార్యక్రమాలను చేపట్టడం హర్షణీయమని పుత్తూరు ఉప విద్యాశాఖ అధికారి రఘురామయ్య అన్నారు. అరవింద్ కంటి ఆసుపత్రి తిరుపతి మరియు స్వయంకృషి జనహిత స్వచ్ఛంద సేవా సంస్థ రాచపాళెం వారి సంయుక్త ఆధ్వర్యంలో నేడు పుత్తూరు బాలికలు ఉన్నత పాఠశాల యందు  దృష్టి దోషం ఉన్న 34 మంది పాఠశాల, కళాశాల విద్యార్థినులకు కళ్లద్దాలను ఉచితంగా పంపిణీ చేసారు. ఆయన పాల్గొన్నారు. అరవింద్ కంటి ఆసుపత్రి తిరుపతి వారి ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తేదీన పుత్తూరు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల యందు విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి దోషం గల 34 మంది విద్యార్థినులను గుర్తించారు. వీరందరికీ పుత్తూరు మున్సిపాలిటీ రాచపాళెం గ్రామానికి చెందిన స్వయంకృషి జనహిత స్వచ్ఛంద సేవా సంస్థ వారి ద్వారా నేడు ఉచితంగా కళ్లద్దాలను  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుత్తూరు మండల విద్యాశాఖ అధికారి తిరుమల రాజు గారు మాట్లాడుతూ స్వయంకృషి సంస్థ ద్వారా గతంలో రాచపాళెం గ్రామంలో పలు కార్యక్రమాలు చేపట్టారని, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా తమ సేవలను మండల స్థాయికి విస్తరించడం అభినందనీయమని, విద్యార్థినిలు సద్వినియోగం చేసుకొని బాగా చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. పుత్తూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రఘుపతి గారు మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, చాలామంది విద్యార్థులు చిన్నవయసులో దృష్టిలోపాన్ని గుర్తించలేకపోవడం వలన విద్యలో వెనకడుగు వేస్తారని, స్వయంకృషి సంస్థ ద్వారా తమ కళాశాల విద్యార్థినులకు కళ్ళద్దాలను పంపిణీ చేసినందుకు  ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతా కుమారి గారు మాట్లాడుతూ విద్యార్థినిలు కళ్లద్దాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. స్వయంకృషి సంస్థ ప్రధాన కార్యదర్శి డైట్ అధ్యాపకులు చెంగల్ రాజు మాట్లాడుతూ స్వయంకృషి సంస్థ ద్వారా విద్యా కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తునామని, విద్యార్థులు తమ లక్ష్య సాధన తర్వాత భవిష్యత్తులో తమ తోటి వారికి సాయం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణగూడ మండల విద్యాశాఖ అధికారి భారతి, స్వయంకృషి సంస్థ కోశాధికారి వడమాల పేట మండల వ్యవసాయ అధికారి ఏ.విజయ్ కుమార్, సభ్యులు హరి ప్రసాద్, బాలికల కళాశాల అధ్యాపకులు పాఠశాల ఉపాధ్యాయినిలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.