Sep 19,2023 16:36
  • నియోజకవర్గ స్థాయి పౌష్టికాహార వారోత్సవాలు
  • సామూహిక అన్నప్రాసనలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.

ప్రజాశక్తి - ఆలమూరు : గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండలంలోని కొత్తూరు సెంటర్లో ఫంక్షన్ హల్ నందు మహిళా, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి పౌష్టికాహార వారోత్సవాలు ఎంపిపి తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆరోగ్యం దృష్ట్యా, పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టాలనే ఆలోచనతో, పేద వర్గాల మహిళలకు పౌష్టికాహార లోపాలతో ఇబ్బందులు పడకూడదనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లను లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. ఇందులో భాగంగా 6 నెలల శిశువులకు సామూహిక అన్నప్రాసన చేశారు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా  3 కేజీల ఫోర్టిఫైడ్ బియ్యం, 2 కేజీల రాగిపిండి, 25 కోడి గుడ్లు, 5 లీటర్ల పాలు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ అటుకులు, అరలీటర్ వంటనూనె, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశెనగ చిక్కి, 250 గ్రాముల ఖర్జూరం అందించడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యమే ధ్యేయంగా ఇవన్నీ అందిస్తున్నారని, ఎక్కడా కూడా నాణ్యతలో రాజీ పడకుండా అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అంతా ఆయురారోగ్యాలతో పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆశీర్వదించారు. అనంతరం అంగన్ వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తోరాటి రాంబాబు, ఎఎంసి చైర్మన్ వై.నాగేశ్వరరావు, ఎంపిడిఓ కె.జాన్ లింకన్, సీడీపీవో శారద, జిల్లా వెల్ఫేర్ కోఆర్డినేటర్ అనంత లక్ష్మీ, నేతలు దొండపాటి చంటి,  నాగమోహన్ రెడ్డి, నామాల శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీలు, తదితరులు పాల్గొన్నారు.