Aug 01,2021 19:02

ఫ్లోరిడా : అంతరిక్షం అంచుల్లోకి మనుషులను బెలూన్లలో తీసుకెళ్లేందుకు ఓ కంపెనీ సిద్ధమవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 'స్పేస్‌ పర్స్పెక్టివ్‌' అనే స్టార్టప్‌ కంపెనీ బెలూన్‌ రైడ్‌కు ఏర్పాట్లు చేస్తోంది. వినియోగదారులను అంతరిక్షం అంచులకు చేర్చేందుకు ఈ కంపెనీ అడ్వాన్స్‌డ్‌ బెలూన్‌ ప్రాజెక్ట్‌ 'స్పేస్‌షిప్‌ నెప్ట్యూన్‌'ను రూపొందించే ప్రణాళికల్లో ఉంది.

ఒక పైలట్‌ సహా ఎనిమిది మంది ఔత్సాహికులను అంతరిక్షం అంచుల వరకూ తీసుకెళ్లనుంది. వాణిజ్య విమానాలు ఎగిరే ఎత్తు కంటే మూడు రెట్ల ఎక్కువ ఎత్తుకు అంటే భూమి నుంచి దాదాపు లక్ష అడుగుల ఎత్తు వరకూ వినియోగదారులను తీసుకెళ్లగలదు. కేవలం రెండు గంటల్లోనే మిమ్మల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు. అక్కడికి చేరుకున్నాక మరో రెండు గంటలు ఆ అంతరిక్ష అందాలను వీక్షించడానికి, ఆస్వాదించడానికి అనువుగా అక్కడే చక్కర్లు కొడుతుంది. తిరిగి భూమిని చేరుకోవడానికి మరో రెండు గంటలు.. మొత్తం ఆరు గంటల ఈ ప్రయాణంలో సూర్యోదయ అద్భుత దృశ్యాలను అంతరిక్షం అంచుల నుంచి ప్రయాణికులు వీక్షించి ఆస్వాదించొచ్చు. అంతేకాదు, ప్రయాణికులు ఆ మధుర క్షణాలను బెలూన్‌ పారదర్శక గోడల నుంచి మొబైల్‌ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. ఈ షికారులో ప్రయాణికులకు కావాల్సిన ఆహారాన్ని టూరిజం సంస్థ వారే సరఫరా చేస్తారు. అంతేకాదు, ఈ బెలూన్‌లో ఒక కిచెన్‌, బార్‌, బాత్‌రూమ్‌ కూడా ఉంటాయి. అయితే, దీని టికెట్‌ ధర రూ.93 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. సో.. అంతరిక్ష అందాలను వీక్షించాలనుకునే వారు రూ.93 లక్షలు కట్టి సీట్‌ బుక్‌ చేసుకోవచ్చు. మరో విషయమేమిటంటే.. ఈ అంతరిక్ష ప్రయాణం 2024లోనే ఉంటుంది సుమా!