Oct 22,2023 09:45
  • లెఫ్ట్‌, ప్రజా సంఘాల నేతలతో ముంబయిలో ఆత్మీయ సమావేశం
  • పాలస్తీనాకు పూర్తి సంఘీభావం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బ్రిటన్‌ పార్లమెంటు సభ్యులు, లేబర్‌ పార్టీ సీనియర్‌ నేత జెరిమి కార్బిన్‌ భారత్‌ పర్యటన బిజీబిజీగా సాగిపోయింది. ఆయన గౌరవార్థం శనివారం ముంబయిలో ఆలిండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌), ప్రొగ్రెసివ్‌ ఇంటర్వేషనల్‌ (పిఐ) సంయుక్తంగా ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాయి. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న క్రూరమైన దాడులు, అణచివేత వంటి చర్యలను సమావేశం తీవ్రంగా ఖండించింది. శాంతి, న్యాయం కోసం జెరెమీ పోషించిన పాత్రను ప్రోగ్రెసివ్‌ ఇంటర్నేషనల్‌ (పిఐ)కి చెందిన వర్ష జి ఎన్‌ తన తొలి పలుకుల్లో ప్రస్తుతించారు. బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాన్ని సంఘటితపరచడం లోను, భారతదేశంలో ఏడాదిపాటు సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమానికి మద్దతుగా బ్రిటన్‌ పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరిగేలా చూడడంలో కార్బిన్‌ ముఖ్యమైన పాత్ర పోషించారని వర్ష జిఎస్‌ పేర్కొన్నారు. కార్బిన్‌ మాట్లాడుతూ, పాలస్తీనా ప్రజలపై ఏడున్నర దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇజ్రాయిల్‌ యుద్ధంలోనే కాదు, ప్రపంచంలో చాలా యుద్ధాల వెనక అమెరికా పాత్ర ఉందని అన్నారు.. పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా బ్రిటన్‌లోను, ప్రపంచ వ్యాపితంగా వ్యక్తమవుతున్న సంఘీభావం గురించి, ర్యాలీల గురించి లేబర్‌ పార్టీ నాయకుడు వివరించారు. అమరజీవి పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుతో తన జ్ఞాపకాలను కార్బిన్‌ గుర్తు చేసుకున్నారు. శాంతి, న్యాయ ప్రాజెక్ట్‌ వ్యవస్థాపకురాలు, జెరిమి కార్బిన్‌ సతీమణి లారా అల్వారెజ్‌ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు, టెలికమ్యూనికేషన్‌ దిగ్బంధనాలకు పాల్పడడం శోచనీయమని అన్నారు. ఎఐకెఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ ధావలే, జెరిమి కార్బిన్‌, లారా అల్వారెజ్‌లను తొలుత పరిచయం చేశారు. సామ్రాజ్యవాద వ్యతిరేకత, సామ్యవాదం పట్ల నిబద్ధత కలిగిన నేత కార్బిన్‌ 40 సంవత్సరాలుగా బ్రిటిష్‌ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2015 నుండి 2019 వరకు లేబర్‌ పార్టీ నాయకుడిగా, పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా కార్బిన్‌ చేసిన కృషిని వివరించారు. వచ్చే ఏడాది భారత్‌, బ్రిటన్‌లలో సాధారణ ఎన్నికలు జరగనున్నందున, ఆ ఎన్నికల్లో వామపక్ష ప్రగతిశీల శక్తుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అందరూ నిలవాలని ఆయన కోరారు.
వామపక్షాల తరపున సిపిఐ ప్రకాష్‌ రెడ్డి జెరెమీ కార్బిన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించగా, ప్రముఖ సినీ నిర్మాత ఆనంద్‌ పట్వర్ధన్‌ లారా అల్వారెజ్‌ను, సంజీవ్‌ చందోర్కర్‌ వర్ష జిఎన్‌ ను అభినందించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఉదరు నార్కర్‌ను జెరెమీకి నెహ్రూ జాకెట్‌ను బహుకరించగా, ఆయన. దానిని అక్కడే ధరించి చూశారు. ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే లారా అల్వారెజ్‌కు శాలువా కప్పి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ వివేక్‌ మోంటెరోలు జెరెమీ, లారాలకు జ్ఞాపికలను అందజేశారు. చివరగా డాక్టర్‌ అశోక్‌ ధావలే భారతదేశం, మహారాష్ట్రలో రైతుల పోరాటాలపై మూడు పుస్తకాలను కార్బిన్‌కు అందించారు.చివరిలో సభికుల ప్రశ్నలకు జెరెమీ క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. మహారాష్ట్రలోని దాదాపు 35 మంది వామపక్ష నేతలు, ప్రగతిశీల మేధావులు ఈ సమావేశానికి హాజరయ్యారు.