Oct 15,2023 08:22

ఆదివారం కావడంతో పిల్లలంతా దొంగ-పోలీస్‌ ఆట ఆడుకుంటున్నారు. తన ఈడు పిల్లలు లేకపోవడంతో గుమ్మం మీద కూర్చుని, ఆటని చూస్తున్నాడు రుద్రాన్ష్‌. పని పూర్తిచేసుకుని వీధిలోకి తొంగి చూసింది పేదరాసి పెద్దమ్మ. ఆమె కంటికి ఒంటరిగా కూర్చున్న రుద్రాన్ష్‌ కనపడ్డాడు. పెద్దమ్మకి రుద్రాన్ష్‌ అంటే వల్లమాలిన ప్రేమ. 'ఒరేరు రుద్రా ఇలా రా' అని పిలిచి చేగోడీలు చేతిలో పెట్టింది. కరకరమని చప్పుడు చేస్తూ ఎంతో ఇష్టంగా తింటూ పెద్దమ్మ దగ్గరే కూర్చున్నాడు రుద్ర.
'వాళ్ళతో ఆడలేక పోయావని బాధపడకు.. సాయంత్రం నీ స్నేహితులందరూ వస్తారు వాళ్ళతో అడుకుందువు గానీ ఇప్పుడు నీకో కథ చెప్తాను శ్రద్ధగా విను' అని కథ చెప్పడం ప్రారంభించింది పెద్దమ్మ.
'అనగనగా చందులూరు అనే గ్రామంలో రంగయ్య అనే ఓ పిసినారి ఉండేవాడు. కష్టపడి సంపాదించిన సొమ్మును తాను తినక, ఇతరులకు పెట్టక పెరటిలో గొయ్యి తీసి, దాచిపెట్టేవాడు. ఆ సొమ్మును చూసుకుంటూ మురిసిపోయేవాడు. ఈ సంగతి పెరటిలో చెట్టు మీద ఉన్న కోతి చూసింది. తన స్నేహితులైన కుక్క, పిల్లి పిల్లలకు చెప్పింది.
ఒక రోజు రంగయ్య విచారంగా అరుగు మీద కూర్చున్నాడు. అది గమనించిన కుక్క రంగయ్య దగ్గరికి వెళ్లి 'రంగయ్యా ఎందుకలా ఉన్నావు? ఏమైంది? అని అడిగింది.
'నేను కష్టపడి పైసా పైసా కూడబెట్టాను. ఇప్పుడా సొమ్మును దొంగలు కాజేశారు' అని బోరున విలపించాడు. ఇదంతా చెట్టు మీద నుంచి వింటున్న కోతి ఒక్క గెంతు గెంతి, రంగయ్య దగ్గరికి వచ్చింది.
'రంగయ్యా నిన్న నీ స్నేహితుడు డబ్బులు అవసరమై నీ సాయం కోరి వస్తే డబ్బులు లేవని అబద్ధం చెప్పావు. ఇప్పుడు నిజంగానే డబ్బులు లేకుండాపోయాయి. అతని భార్యకి అనారోగ్యమని చెప్పినా నువ్వు వినిపించుకోలేదు' అంది.
'అతడు నా స్నేహితుడే.. కానీ నా డబ్బులు తిరిగిస్తాడని నమ్మకమేమిటి?' అన్నాడు రంగయ్య.
'స్నేహానికి నమ్మకమే పునాది. నువ్వు నీ స్నేహితుడినే నమ్మకపోతే మరెవరిని నమ్మగలవు? అందుకే నీకు తగిన శాస్తి జరిగింది!' అంటూ వెళ్ళిపోయింది కోతి.
అటువైపుగా వస్తున్న పిల్లిపిల్ల దగ్గరలో ఉన్న గోతిలో పడిపోయింది. బయటకి రాలేక 'మ్యావ్‌ మ్యావ్‌' అని అరవసాగింది. అది విన్న కోతి, కుక్క పరుగు పరుగున వెళ్లాయి. గొయ్యి లోతుగా ఉంది. ఏమిచెయ్యాలో వాటికి తోచక గొయ్యి చుట్టూ తిరగసాగాయి. ఎలాగైనా తమ స్నేహితుడిని రక్షించాలనుకున్నాయి. ఒక వెదురు కర్రను తెచ్చి గోతిలో నిలబెట్టింది కోతి. ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ వెదురుని ఆసరాగా చేసుకుని పైకి రాలేకపోయింది పిల్లిపిల్ల. గోతిలోనే ఏడుస్తూ ఉంటే చూడలేక గబాలున గోతిలోకి దిగి, పిల్లి పిల్లని ఒక చేత్తో పట్టుకుని వెదురు కర్ర మీద నుంచి బయటకి వచ్చింది కోతి.
పిల్లిపిల్లకు సపర్యలు చేసి, ఆహారం పెట్టాయి. ఇదంతా గమనించిన రంగయ్య 'నేను మీ పాటి కూడా ఆలోచించలేకపోయాను' అని బాధపడ్డాడు. 'ఇప్పటికైనా మించిపోయింది లేదులే నీలో మార్పుకోసం మేము ఆడిన నాటకం ఇది' అని రంగయ్యకి డబ్బుల మూటని అందించింది కోతి. నాటి నుంచి రంగయ్య అవసరం మేరకు ఖర్చు చేస్తూ, ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఆనందంగా గడపసాగాడు.' అని కథ ముగించింది పెద్దమ్మ.
- కాశీవిశ్వనాథóం పట్రాయుడు
94945 24445