Oct 15,2023 09:12

అమాంతంగా చీకటైన గదిలో
అక్షరాలు నవ్వుతున్నాయి
నిరుద్యోగినైన నన్ను జూసి..!
సిగ్గుతో తల దించుకున్నాను
అల్మరాలోని డిగ్రీ పట్టాల
వెకిలి చూపులు..
గుండెను మెలిపెట్టి కోస్తున్నై
తిరగేసిన పేజీల శబ్దం
వెన్నులో వణుకు పుట్టిస్తున్నది
ఆశయం ఆశ సన్నగిల్లి
ఛిద్రమైన బతుకు చిత్రం
నిరుద్యోగి కన్నీటి వెల శూన్యమా?
నౌకరీ కావాలంటే నేరమా..
మరి లాఠీలెందుకు నా వీపుపై
నెత్తుటిని పూస్తున్నై
నా కాలాన్ని మనోగాయాన్ని
కాజేసిన సర్కారుకు
జరిమానెవరు విధించాలి?
న్యాయమిక్కడ దేవులాటేనా?
భావి జ్ఞాన నిర్మాణం
పురిట్లోనే సమాధి చేద్దామా?


- అమృతరాజ్‌