Nov 10,2023 11:32

న్యూఢిల్లీ :   ఢిల్లీ ప్రజలకు శుక్రవారం వాయు కాలుష్యం నుండి కొంతమేర ఉపశమనం కలిగింది. గురువారం రాత్రి ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాయు నాణ్యతా ప్రమాణం మెరుగైనట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదివారం దీపావళికి ముందు కాలుష్య తీవ్రత  మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ వ్యాప్తంగా కృత్రిమ వర్షాలు కురిపించాలని ఢిల్లీ ప్రభుత్వం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి)తో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన స్థాయి కంటే 100 రెట్టు అధికంగా గాలిలో హానికరమైన కణాలు ఉండటంతో వారంరోజులుగా తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు అల్లాడిపోయారు. గురువారం వరకు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

శుక్రవారం ఉదయం 7.00 గంటలకు వాయు నాణ్యతా ప్రమాణ సూచీ (ఎక్యూఐ) 407గా ఉన్నట్లు వాయు నాణ్యతా పర్యవేక్షణ సంస్థ ఎస్‌ఎఎఫ్‌ఎఆర్‌ తెలిపింది. వీటిలో కొన్ని ప్రాంతాలు కాలుష్య తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. అశోక్‌ విహార్‌ (443), ఆనంద్‌ విహార్‌(436), రోహిణి (429), పంజాబీ బాఫ్‌ు (422)గా ఉంది. నొయిడా, గురుగ్రామ్‌ ఇతర ప్రాంతాల్లో ఎక్యూఐ మరింత పేలవంగా మారింది. నొయిడాలో ఈ రోజు ఉదయం ఎక్యూఐ (475), ఫరీదాబాద్‌ (459), గురుగ్రామ్‌ (386), ఘజియాబాద్‌ (325)గా ఉంది.